‘సోడా… అదీ గోలీసోడా… ఇప్పటికీ ఉందా… ఇంకా తాగుతున్నారా… ఏనాటి సంగతి… అరె, అసలు అదొకటి ఉండేదన్నదే మర్చిపోయామే… ఇప్పుడెందుకు సడెన్‌గా సీనులోకి వచ్చింది… ఇలా ప్రశ్నలమీద ప్రశ్నలూ, బోలెడన్ని సందేహాలూ రావడం సహజమే. రకరకాల సాఫ్ట్‌డ్రింకుల పుణ్యమా అని సోడా దాదాపుగా సైడయిపోయిన సంగతి నిజమే కానీ ఇప్పుడు మళ్లీ వస్తోంది… సరికొత్త బ్రాండ్ ఇమేజ్‌తో, వెరైటీ ఫ్లేవర్స్ తో.గోలీసోడా… కొందరికి చిన్ననాటి తీపి జ్ఞాపకం. కానీ మరికొందరికి ఇప్పటికీ దాహాన్ని తీర్చే కార్బొనేటెడ్ పానీయం. అవునండీ… సిటీల్లో కాస్త తగ్గినా నేటికీ చాలా పల్లెల్లో వేసవి దాహాన్ని తీర్చే శీతలపానీయం అంటే గోలీసోడానే. అదే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోబాటు ఉత్తరాది రాష్ట్రాలకి వెళితే ఇప్పటికీ గోలీసోడానే ఇష్టమైన స్ట్రీట్ డ్రింక్. ఉత్తరాదిన దీన్నే బాంటా అంటారు.
**ఓ సోడా కొట్టవోయ్..
సుమారు ఇరవయ్యేళ్ల క్రితం… పల్లెల్లో గణగణ…. అంటూ వినవచ్చే ఆ గంట చప్పుడు కోసం ఇంటిల్లిపాదీ చెవులు రిక్కించేవారు. మధ్యాహ్న సూరీడు నడినెత్తిమీద నుంచి కాస్త పక్కకు జరిగి పడమటకు వాలే వేళ… సోడా బండి గంట శబ్దం, ఆ వెనకనే …స్‌స్‌స్‌స్ మంటూ పొంగే నీటి ధ్వని… ఉన్నట్టుండి అందరికీ తెగ దాహం వేసేది. నాకూ, నాక్కూడా… ఒకటీ, ఇంకొకటీ … అంటూ మొత్తం అందరూ ఆ బండిలోంచి సోడాకాయలు తెప్పించుకోవడం… కొట్టించుకోవడం మామూలే. వాటిల్లోనూ రకాలకి కొదవ లేదు. మామూలుదని ఒకరూ, తియ్యసోడా అని ఇంకొకరూ, నిమ్మకాయ సోడానే కావాలనేవాళ్లు మరొకరు. మొత్తంగా అది సోడా సమయం.
వానల్లో సోడా బండబ్బాయికి డిమాండ్ ఉండేది కాదనుకుంటే పొరబాటే. అదేంటోగానీ ఉన్నట్టుండి ఇంట్లోని పిల్లలందరికీ ఒకటే కడుపులో నొప్పి. పొట్ట పట్టుకుని మెలితిరిగిపోయేవారు. దాంతో ఇంట్లో ఎవరుంటే వాళ్లు వెంటనే ఊళ్లోని సోడా అబ్బాయికి కబురంపడం, సోడా తెప్పించడం, కొట్టించడం, తాగించడం నిమిషాల్లో జరిగిపోయేది. ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే ఆ నొప్పి హుష్‌కాకి. పెద్దవాళ్లకయితే… పొట్టలోనుంచి అదేపనిగా తేన్పులు పుట్టుకొచ్చేస్తాయ్. ‘ఒరే అబ్బాయ్… పనిలోపనిగా నాకూ ఒకటి కొట్టరా… ఏంటో పొద్దుటినుంచీ తిన్నది అరగనేలేదు’ అంటూ చేయి చాపుతారు. గోలీసీసాలోని ఆ సోడానీళ్ల మీద మంచంలోని బామ్మలకీ తాతయ్యలకీ ఎంత మమకారమో. ప్రతి ఇంటా వారానికి రెండుమూడు సార్లయినా ఈ సోడా డ్రామా బ్రహ్మాండంగా రక్తి కడుతుండేది. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ అడుగడుగునా సోడా దుకాణాలే. వాటిల్లో కలర్‌సోడాలు మరీ స్పెషల్.
**తియ్యని జ్ఞాపకం..!
పిల్లలకి మాత్రం గోలీసోడా సరదా ఓ పట్టాన తీరేది కాదు. స్కూలు ఇంటర్వెల్లో పావలానో అర్ధరూపాయో పట్టుకుని గేటుపక్కనే ఉన్న బడ్డీకొట్టుకి పరుగెత్తి అందులోని రంగుల గోలీని కళ్లార్పకుండా చూస్తూ దాన్ని తాగడానికి పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రబ్బరు కార్కుతో సోడా కొట్టగానే గోలీ లోపలికి వెళ్లినప్పుడు వచ్చే ఆ శబ్దానికి కళ్లనిండా ఆశ్చర్యమే. ఆ గోలీని ఎలాగైనా బయటకు తీయాలనే అలుపెరగని ప్రయత్నం ఎప్పటికీ తీరని ఆశే. అలాగే బాటిల్‌కి ఒక పక్క రెండు నొక్కులు ఉంటాయనీ వాటినే కళ్లు అంటారనీ ఆ వైపుకి వంపితేనే సోడాబుడ్డిలోని నీళ్లు గొంతులోకి సాఫీగా వస్తాయనీ తెలియని పసితనంలో అది పట్టుకోవడం కుదరక గోలీ అడ్డుపడి తాగడానికి ఇబ్బందిపడటం ఎందరికో అనుభవమే. తరవాత దాన్ని ఏ కోణంలో ఎత్తి పట్టుకోవాలో తెలుసుకున్నప్పుడు ఏదో పెద్దవాళ్లయిపోయి, అన్నీ తెలిసిపోయిన భావన. మొత్తమ్మీద గోలీసోడా తాగడం… ఓ తియ్యని జ్ఞాపకం.
**రకరకాల రుచుల్లో..!
అందరూ ఎంతో ఇష్టంగా తాగే ఆ సోడా కాలక్రమంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. మన దగ్గర మరీనూ. కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తిగా పోలేదు. రోజ్‌ఎసెన్స్ కలిపిన పనీర్ సోడా అంటే తమిళ తంబిలకి మహా ఇష్టం. కొన్ని ప్రాంతాల్లో అల్లం, నన్నారి, నారింజ సోడాలూ ఉన్నాయి. అయితే, ఆ బాటిళ్లను కడగడం కష్టమనో లేదా తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంతోనో విభిన్న సాఫ్ట్‌డ్రింకుల వెల్లువతోనో వాటి వాడకం క్రమేణా తగ్గింది. కానీ దాని మీదున్న క్రేజ్ పూర్తిగా పోలేదు. అది గమనించే చెన్నై, బెంగళూరులకి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కాళయ్యన్, కోజ్‌మో… వంటి బ్రాండ్లతో అన్ని రకాల ప్రమాణాలతో గోలీసోడా యూనిట్‌లు ప్రారంభించారు. గోలీసోడా గురించి లోతుగా అధ్యయనం చేసి మరీ కొత్త రుచుల్ని జోడిస్తున్నారు. నిమ్మ, నారింజ, ద్రాక్ష, పనీర్(రోజ్ ఎసెన్స్), నింబూమసాలా, పైనాపిల్… ఇలా రకరకాల ఫ్లేవర్స్‌లో సోడాని తయారుచేస్తున్నారు. వాటికి లెమన్ ట్రీ, పర్పుల్ హేజ్, బెడ్ ఆఫ్ రోజెస్… అంటూ పాపులర్ ఇంగ్లిష్ పాటల పేర్లు పెట్టి మరీ యువతని ఆకర్షిస్తున్నారు. దుకాణాలతోబాటు కొన్ని హోటళ్లూ, క్లబ్బులూ కాలేజీలకీ కూడా ఈ సోడాలను సరఫరా చేస్తున్నారు. దాంతో అందరి దృష్టీ మళ్లీ సోడావైపు మళ్ళుతోంది.
అదే ఉత్తరాదికొస్తే, నింబూసోడా, కాంచెవాలీ డ్రింక్‌గా పిలుచుకునే దిల్లీబాబులకీ గోలీసోడా అంటే యమా క్రేజ్. అందుకే అక్కడ గోలీసోడా స్థానం ఇప్పటికీ సుస్థిరమే. నిమ్మరసం, చాట్‌మసాలా, బ్లాక్‌సాల్ట్ వంటివి కలిపి మరీ సోడా తయారుచేస్తారక్కడ. గులాబీ, దానిమ్మ… కొత్త రుచుల్నీ జోడిస్తున్నారిప్పుడు. దిల్లీలో కొత్తగా పెట్టిన ఓ రైలు రెస్టరెంట్ మెనూలోనూ బాంటా చేరింది. ఇంకా ముంబై, దిల్లీ వీధుల్లో బాంటాబార్‌లూ స్టాల్సూ తెరుస్తున్నారు. తులసి, నేరేడు, లిచి, గ్రీన్‌ఆపిల్, మామిడి షర్బత్… వంటివి మిక్స్‌చేసిన కాక్‌టెయిల్స్‌ని గోలీసోడాల్లో నింపి మరీ ఇస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో రోడోడెండ్రాన్ పూలఫ్లేవర్‌తోనూ సోడా చేస్తున్నారు. మధ్యప్రాచ్య దేశీయులకీ గోలీసోడా ఫేవరెట్ డ్రింకే.
**సోడాలో గోలీ ఎందుకు..?
గోలీసోడాలో ఉండేది కార్బొనేటేడ్ నీళ్లే. మొదటగా 1767లో జోసెఫ్ ప్రిస్ట్‌లే అనే శాస్త్రవేత్త, కార్బన్‌డయా క్సైడ్‌ను నీటిలోకి పంపి, స్నేహితులకి ఇస్తే, ఆ రుచి నచ్చడంతో అందులో పండ్ల ఫ్లేవర్లూ, చక్కెరలూ కలిపి సాఫ్ట్‌డ్రింక్స్ తయారుచేయడం ప్రారంభించారు. అందుకే సోడా కూడా ఓ సాఫ్ట్‌డ్రింకే. మొదట్లో సోడా నీళ్లని సాదా బాటిల్స్‌లోనే నింపేవారు. అయితే మూత బిగించేటప్పుడూ తీసేటప్పుడూ గ్యాస్ పోయేది. అలా పోకుండా ఉండేందుకు రూపొందినదే ఇప్పుడు మనం చూస్తోన్న కాడ్ నెక్ బాటిల్. 1872లో హిరమ్ కాడ్ అనే బ్రిటిష్ ఇంజినీర్ దీన్ని తయారుచేశాడు. ఈ బాటిల్ మందంగా ఉంటుంది. ‘సోడాబుడ్డి కళ్లద్దాలు…’ అనేమాట అలా వచ్చినదే.
గోలీసోడా కూడా బ్రిటిషర్ల వెనకే మనదేశంలోకి వచ్చింది. వాళ్లు వెళ్లిపోయారు. కానీ మనదేశంలో వీధికో సోడా కొట్టు వెలిసింది. మొదట్లో సోడాసీసాలనూ ఇంగ్లాండ్ నుంచే తెప్పించుకునేవారు.
**క్రమంగా మనదగ్గరే తయారుచేయడం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని సాస్నిలో ఖండేల్‌వాల్ గ్లాస్ వర్క్స్ ఈ సోడాసీసాలను భారీయెత్తున తయారుచేస్తోంది. వీటిని ముందుగా నీటితో నింపి, ఆపై గ్యాస్‌తో నింపి, గోలీతో సీల్ చేస్తారు. దాంతో గ్యాస్ బయటకు పోకుండా ఉంటుంది. తాగేటపుడు మధ్యలో సీసాని దించినా గోలీ సీసా మెడ దగ్గరే ఉండి గ్యాస్ ఒకేసారి బయటకు పోకుండా ఉంటుంది. తరవాత్తరవాత ఈ గ్యాస్ నీటిని నేరుగా గ్లాసుల్లోకి నింపి ఇచ్చే సోడా ఫౌంటెయిన్లూ వచ్చాయి. అజీర్తి, వికారం, తలనొప్పి వంటి వాటికి ఇది మంచి మందు అనే నమ్మకం కారణంగా వీటిని తాగడం బాగా పెరిగింది. సోడానీళ్లని ఇంట్లోనే చేసుకునే మెషీన్లూ వచ్చాయి. అందుకే సోడా అంటే ఇప్పుడు కేవలం గోలీసోడాగానే కాదు, సాదా బాటిళ్లలో అనేక రుచుల్లోనూ అలరిస్తోంది. ఐస్‌క్రీమ్‌ను కలిపీ తాగుతున్నారు.
ఏది ఏమయినా గ్యాస్‌తో కలగలిసి గోలీసీసాలోని నీళ్లు గొంతులోకి దిగుతుంటే కలిగే అనుభూతే వేరు. అందుకే గోలీసోడా… ఓ గమ్మత్తైన ఎవర్‌గ్రీన్ పానీయం..!
గోలీసోడా చరిత్ర ఇది
Related tags :