బజాజ్ ఆటో ఇప్పుడు కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. బజాజ్ ‘క్యూట్’ పేరుతో తొలిసారిగా కార్లను తయారుచేస్తోంది. ఏప్రిల్ 18న అధికారికంగా ఈ కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ నేడు ప్రకటించింది. అంతేగాక.. భారత్‌లోనే తొలి క్వాడ్రిసైకిల్ ఇదే కావడం విశేషం. అంటే డిజైన్, వినియోగం పరంగా ఆటో, కారుకు మధ్యస్తంగా ఉంటుంది. క్వాడ్రిసైకిల్ వాహనాల తయారీకి 2018లో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ వాహనాలను అటు కమర్షియల్‌గానూ.. ఇటు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు. బజాజ్ క్యూట్‌కు తొలిసారిగా 2012 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేశారు. ఆ తర్వాత 2016 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించారు. 216సీసీ సామర్థ్యం, సింగిల్ సిలిండర్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ తదితర ఫీచర్లతో దీన్ని తయారుచేశారు. దీన్ని పెట్రోల్ వెర్షన్‌లో అయినా, సీఎన్‌జీ వెర్షన్‌లో అయినా వాడుకోవచ్చు. పెట్రోల్ వెర్షన్‌లో ఈ కారు 13 బీహెచ్‌పీ పవర్, 18.9ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌లో 10 బీహెచ్‌పీ పవర్, 16ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కారును తీసుకొస్తున్నట్లు గతంలో బజాజ్ వెల్లడించింది. అందుకే అందుబాటు ధరల్లో విడుదల చేస్తోంది. పెట్రోల్ వెర్షన్ ధర రూ. 2.64లక్షలు, సీఎన్‌జీ వెర్షన్ ధర రూ. 2.84లక్షలుగా(ఎక్స్‌షోరూం) ఉంటుందని తెలిపింది.
బజాజ్ సరికొత్త కారు – “క్యూట్”
Related tags :