ఇప్పటికే వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు దూరమయ్యాయి. ఆర్సీబీ ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడు ఓడింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలోనే కొనసాగుతూ వస్తోంది. బెంగళూరు అభిమానులకు గత మ్యాచులో గెలుపు కాస్త ఊరటనిచ్చినా.. మళ్లీ ఓటమి నిరాశ మిగిల్చింది. అయితే ఈ మ్యాచులో గెలవాల్సిన సమయంలో తప్పుడు నిర్ణయంతో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. వాంఖడే మైదానం వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబయి ఇండియన్స్‌కు చివరి 12 బంతులకు 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ముంబయి బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ ఉన్నారు. 19వ ఓవర్‌ను తొలుత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీతో వేయించాలని కోహ్లీ అనుకున్నాడు. అయితే, సైనీకి కాకుండా స్పిన్నర్ పవన్ నెగికి బంతి ఇవ్వాలని డగౌట్లో ఉన్న బెంగళూరు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచించాడు. కోచ్ నిర్ణయం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకొని కోహ్లీ బంతిని పవన్‌కు ఇచ్చాడు. ఆ ఓవర్లో చెలరేగి ఆడిన పాండ్య 22 పరుగులు చేసి ఓవర్ ముగిసేలోపే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఆశిష్ నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు. క్రీజులో పాండ్య, పొలార్డ్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నప్పుడు స్పిన్నర్లకు బౌలింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేసే నవదీప్ సైనీకి బౌలింగ్ ఇచ్చి ఉంటే బ్యాట్స్‌మెన్ కొంత ఇబ్బంది పడేవారని అంటున్నారు. బెంగళూరు గెలిచే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆశిష్ నెహ్రానే అంటున్నారు. ఆర్సీబీ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో తట్టుకోలేని అభిమానులు సోషల్ మీడియాలో నెహ్రాపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఆశిష్ నెహ్రా తలుచుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థిని కూడా యూనిట్ టెస్టులోనే ఫెయిల్ చేయగలడంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నెహ్రాను తిట్టిపోస్తున్నారు
Related tags :