NRI-NRT

జర్మనీలో ఉగాది వేడుకలు జరుపుకున్న ప్రవాసులు

germany colos ugadi 2019

జర్మనీలో కొలోన్ తెలుగు వేదిక ఆధ్వర్యంలో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొలోన్‌లోని స్థానిక ఆడిటోరియంలో అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమానికి కొలోన్ చుట్టు పక్కన ప్రాంతాలైన ఆకెన్, బాన్, డ్యూస్సెల్ డోర్ఫ్, డ్యూస్బెర్గ్, కొబ్లెంస్, ఫ్రాంక్‌ఫర్ట్‌లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. నాటకాలు, పద్యాలు, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్ నృత్యాలు, తెలుగుదనం ఉట్టిపడే సమకాలీన నృత్యాలతో అందరినీ ఆద్యంతం ఆసక్తికరంగా అలరించారు. ప్రతేకించి చిన్నారులు ఆలపించిన హనుమాన్ చాలీసా, పంచాంగ శ్రవణంతో పాటూ, కూచిపూడి, భరతనాట్యం వంటి కార్యక్రమాలతో వేడుక అంతా ఉత్సాహంగా గడిచింది. విశ్వవిద్యాలయాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అతిథులందరికి రుచికరమైన తెలుగు వంటకాలతో భోజనాలు వడ్డించారు. సాయంత్రం వరకు ఎంతో సరదాగా, సంబరంగా ఈ వేడుక సాగి పోయింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక సహాయ సహకారాలు అందించిన సంఘ సభ్యులకు అతిథులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.