Movies

కంగనపై చెప్పు విసిరిన మహేశ్ భట్

mahesh-bhat-threw-sandals-at-kangana-says-rangoli-to-sony

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ.. సినీ నటి ఆలియా భట్‌ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కంగన.. ఆలియా నటనను వెక్కిరిస్తూ కామెంట్‌ చేశారు. దాంతో ఆలియాకు మద్దతుగా సినీ నటుడు రణ్‌దీప్‌ హుడా ఓ ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ ఆలియా.. కొందరు మానసిక రోగులు మాట్లాడే మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై కంగన సోదరి రంగోలీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆలియా బేబీని కాపాడటానికి బంధుప్రీతి గ్యాంగ్‌కి ధైర్యం లేదు. అందుకే నిన్ను (రణ్‌దీప్‌ను ఉద్దేశిస్తూ) ఉసిగొల్పారు. ‘ఉంగ్లీ’ సినిమా చిత్రీకరణ సమయంలో నువ్వు నా సోదరి పట్ల ఏం చేశావో నాకు తెలుసు. కంగనను చాలా హింసించావు. కరణ్‌ జోహార్ లాంటి వారి వల్ల నువ్వు సక్సెస్‌ కాలేకపోయావు కానీ అతని చంచాగిరి వల్ల కనీసం ఆలియా అయినా విజయం సాధించింది. రణ్‌దీప్‌.. నువ్వైతే ఎప్పటికీ ఫెయిల్యూర్‌వే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రంగోలీ తన కుమార్తె ఆలియా గురించి చేస్తున్న వ్యాఖ్యలను తట్టుకోలేక ఆమె తల్లి సోనీ రాజ్దాన్‌ ఓ ట్వీట్‌ చేశారు. కంగనకు తన భర్త మహేశ్‌ భట్‌ సినిమాల్లో తొలి అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై రంగోలీ స్పందిస్తూ……..‘డియర్‌ సోనీ జీ.. మహేశ్‌ భట్‌ కంగనకు తొలి అవకాశం ఇవ్వలేదు. అనురాగ్‌ బసు ఇచ్చారు. మహేశ్‌ తన సోదరుడి నిర్మాణ సంస్థలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మహేశ్‌ భట్‌కు అసలు నిర్మాణ సంస్థే లేదు. ‘వో లమ్హే’ సినిమా తర్వాత మహేశ్‌.. కంగనతో ‘ధోకా’ అనే సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇందులో కంగన సూసైడ్‌ బాంబర్‌ పాత్రలో నటించాలని కోరారు. కానీ ఇందుకు కంగన ఒప్పుకోలేదు. దాంతో తన ఆఫీస్‌కు పిలిపించి కంగనను నోటికొచ్చినట్లు తిట్టారు. ఆ తర్వాత ‘వో లమ్హే’ ముందస్తు ప్రదర్శన షోకు కంగన వెళ్లినప్పుడు థియేటర్‌లో ఉన్న మీ భర్త మహేశ్‌ భట్‌ నా సోదరిపై చెప్పు విసిరాడు. నా సోదరి నటించిన సినిమాను చూడనివ్వలేదు. ఆరోజు రాత్రంతా కంగన ఎంతో ఏడ్చింది. అప్పుడు తన వయసు కేవలం 19 ఏళ్లు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగోలీ.