ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల వివరాలను ఎట్టకేలకు పోలీసులు లెక్కగట్టారు. నయీమ్ ఆస్తుల విలువ అక్షరాలా రూ.2వేల కోట్లుగా సిట్ లెక్కతేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకుంది. నయీమ్‌కు సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టు ఆధీనం ఉన్నాయి. మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. మరో రెండు నెలల్లో నయీమ్ కేసు దర్యాప్తును సిట్ ముగించనుంది.
*** మొదటి దఫాలో రూ. 140 కోట్ల ఆస్తి…
నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా అతని భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే…
హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు.
మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా.
పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు.
షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు.
తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు.
కరీంనగర్ శివారులోని నగునూర్‌లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్.
నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు.
మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు.
భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లు.
గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇల్లు గుర్తింపు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు.
నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్‌మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్‌ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు.
నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్ విలువ రూ. 2 కోట్లు.
కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు.
మేడ్చల్‌లో 3 ఎకరాలు, శామీర్‌పేట్‌లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజా ప్రతినిధితో చేసిన సెటిల్‌మెంట్‌లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు.
మొయినాబాద్‌లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ల్యాండ్ సెటిల్‌మెంట్‌తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది.
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు.
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది. నయీమ్ మొత్తం 1,019 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్‌మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. అయితే ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది. అలాగే అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆదాయ మార్గాలు చూపించడంతోపాటు ఆస్తులను సీజర్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది. దీంతో సిట్ ఆస్తులను గుర్తించినా స్వాధీనానికి తగ్గ ఆధారాలు సంపాదించలేకపోయినట్లు తెలుస్తోంది.