* కొండెక్కిన కూరగాయల ధరలు
* 10 రోజుల్లో భారీగా పెరుగుదల
* సామాన్యుడికి పచ్చడి మెతుకులే దిక్కు..
* కిలో బీన్స్ రూ.150 మిర్చి రూ.80
మండే ఎండలకు తోడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఒక్కో కూరగాయల ధర ఒకటికి మూడు రెట్లు పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలను సామాన్యుడి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఏ కూరగాయ కొనాలన్నా కొండెక్కి కూర్చోవడంతో ప్రజలకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేం, తినలేం అంటూ సామాన్య మధ్య తరగతి ప్రజలు నిట్టూరుస్తున్నారు. కూరగాయల ధరలు మార్కెట్‌లో చుక్కలనంటుతున్నాయి. గతంలో ఎన్నుడో లేని విధంగా బీన్స్ కిలో రూ.150 పలుకుతోంది. ఊహించని విధంగా ఈ వారంలోనే కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతి సంచి కూరగాయలతో నిండాలంటే రూ.300-400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇంతటి ధరలు ఎప్పుడూ చూడలేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. మార్కెట్‌లో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నా తమకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడంం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ల ఖర్చులు పోను మిగిలేది నామమాత్రమే అని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సామాన్యులకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. ఎండలతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు పెరిగిపోతుంటే సామాన్యులు ఎం కొనాలి. ఈ ధరలతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు పచ్చిడి మెతుకులే!