ఈసారి ప్రపంచకప్ గెలుస్తామన్న నమ్మకం లేకపోతే అసలు టోర్నీలో పాల్గొనకపోవడం మంచిదని సఫారీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. ఐసీసీ ర్యాంకులు ప్రపంచకప్ గెలిచే అవకాశాలను ప్రభావితం చేయవు. ర్యాంకింగ్ ప్రధానమైతే వెస్టిండీస్‌ది ఏ ర్యాంకో కూడా తనకు తెలియదన్నాడు. కానీ, ఆ జట్టు ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడగొట్టింది అని గుర్తు చేశాడు. స్టెయిన్ ఇప్పటికే రెండు ప్రపంచకప్ టోర్నీలో దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సారి ప్రతి జట్టుకూ టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే మిగిలుందని అన్నాడు. మా జట్టు విషయానికొస్తే.. ‘ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న డూప్లెసీస్, డికాక్, ఇమ్రాన్ తాహీర్, కగీసో రబాడ ఇప్పటికే రాణిస్తున్నారు. ప్రపంచకప్‌లోనూ రాణిస్తారన్న నమ్మకం ఉంది. మా జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లే. ఇవన్నీ పక్కనపెడితే టోర్నీలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. మా జట్టుకు ప్రదర్శనతో పాటు కొంచెం అదృష్టం కూడా కావాలి. ఎందుకంటే ఒకే ఒక్క నోబాల్ కూడా టోర్నమెంట్‌ను గెలిపించగలదు’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అవకాశాల గురించి మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా వన్డే సిరీస్ ఓడిపోలేదు. కాబట్టి జట్టు దృఢంగా ఉందని అనుకుంటున్నాను’ అని తెలిపారు. 2015లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ప్రపంచకప్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయింది. అయితే, ఈ రోజు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే జట్టును ప్రకటించనుంది. దక్షిణాఫ్రికా మే 30న ఇంగ్లాండ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. 2019 ఐపీఎల్ వేలంపాటలో ఎవరూ తీసుకోకపోవంతో టోర్నీకి దూరంగా ఉన్న స్టెయిన్ ఐపీఎల్‌లో చేరనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ కౌల్టర్‌నైల్ గాయంతో టోర్నీకి దూరమవడంతో స్టెయిన్‌కు అవకాశం వచ్చింది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో స్టెయిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
సెహభాష్ స్టెయిన్ – అదిరిపోయే లాజిక్
Related tags :