వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో రాగిజావ చాలా ఆరోగ్యకరం. రాగిజావను రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…
∙రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
∙వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది.
∙రాగి పిండిలో విటమిన్–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోబాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి.
∙బరువు తగ్గాలనుకునేవారు రాగులను జావ రూపంలోనే కాదు, సంగటిగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
∙రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.
∙దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.