*** పసుపు రత్తం సంద్రమైతే…
*** గెలుపు చిత్తం ప్రవాసాంధ్రమైతే…
తమ భవిష్యత్తును తామే రచించుకునేందుకు పౌరుల అక్కరకు వచ్చిన ఆయుధం – సిరాచుక్క. అధికార దాహార్తి తీర్చుకునేందుకు ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసేందుకు ధనప్రవాహాన్ని ఓటర్ల జేబుల్లోకి గొంతుల్లోకి మళ్లించే నాయకులు…గత ఎన్నికల్లో తమ వర్తమానాన్ని బాగుచేస్తామన్న హామీల అమలకు ఏమైందనే ఓటరు ప్రశ్నకు ఈ ఎన్నికల్లో వాగ్ధానాలే సరైన సమాధానమనడం పౌరుల ఆశలకు చెంపపెట్టు. నాయకులు చేసే ప్రలోభాల వలలో చిక్కుకున్న ఓటరును చైతన్యపరిచేందుకు ప్రవాసాంధ్రులు 2019 ఎన్నికల సందర్భంగా అమరావతికి తరలిరావడం శుభపరిణామం.
దైనందిన కష్టనష్టాలు కనిష్ఠంగా ఉండే విదేశాల్లో కడుపులో చల్ల కదలకుండా కూర్చుని చేసుకునే ఉద్యోగాల్లో జీవితాన్ని సాఫీగా నడిపేసుకునే ప్రవాసులు ఎక్కడో వేలాది మైళ్ల ఆవల తమ మాతృభూమి పట్ల దాని భవిత పట్ల తమ బాధ్యత గుర్తెరగడం ముదావహం. తెదేపా, భాజపా, కాంగ్రెస్, వైకాపా, జనసేనలకు చెందిన చాలా మంది ప్రవాసులు ఈ ఎన్నికల్లో ఫోన్లు-ఫేస్‌బుక్‌లు, టెక్స్ట్లు-ట్విట్టర్లు, మీటింగులు-ఛాటింగుల ద్వారా తాము సమాజానికి మంచి చేస్తుందనే నమ్మే పార్టీల పక్షాన విరివిగా ప్రచారాస్త్రాలు సంధించారు. ప్రజల్లో నిష్పక్షపాత చైతన్యాన్ని రగిలించి ఎవరిలో సేవ యావ లావుగా ఉందో గ్రహించి ఓట్లు గుద్దమనే ధోరణి లేకపోవడం విడ్డూరం. రోట్లో పచ్చడి లాగా అదే రుబ్బుడు ప్రసంగం, ప్రత్యర్థిపై అదే పరుష పదజాలం. తర్కం లేని హామీలు, తలతిరిగిపోయే తిట్లు. ఇక్కడే విసుగెత్తిన ప్రజలకు ఓ వెలుగురేఖ దొరికింది. అది తనకు ఓటేయమంటుంది. కానీ ఎందుకు వేయాలో కూలంకుషంగా వివరిస్తుంది. తన పథకాలు అన్నీ ఏకరువు పెడుతుంది. కానీ అవి ఏ ఒక్కరికో కాకుండా సర్వ సమూహ క్షేమానికి ఏ విధంగా ఉపయుక్తమో క్రోఢీకరిస్తుంది. తన హామీలు అన్నీ బట్టబయలు చేస్తుంది. కానీ వాటి అమలుకు ఎదురయ్యే సవాళ్లను ఎలా దునుమాడలనుకుంటున్నామో విశదీకరిస్తుంది. “ఫ్యాన్” గాలి అక్కర్లేని, “గ్లాసు” ధార అందుకోలేని, “ఇతర” అడ్డంకులు ఆపలేని సుదూర చేతనా తీరలకు సాఫీగా “సైకిల్” మీద చేరుస్తుంది.
లక్షల సంఖ్యలో విదేశాల్లో నివశించే ప్రవాసాంధ్రుల నుండి 2019 ఎన్నికల్లో ఎంత మంది ఒటేశారనే మాటకు సిగ్గు సిగ్గుపడే సమాధానం 5200. కానీ ఇదే ప్రవాసాంధ్రుల్లో తమ అభిమాన నాయకులు, పార్టీల తరఫున ఎంత మంది ప్రచారం చేశారనే ప్రశ్నకు సమాధానం మాత్రం 75 శాతానికి పైమెట్టే! అంటే జనజాగృతికి, ఓటరుచైతన్యానికి, ప్రజాప్రేరణకు ఎన్నికల్లో ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని పార్టీల నుండి ఎంతో కొంతమంది ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనలేకపోయినా, స్థానికంగా కార్యకర్తలను సమీకరించి, అంతర్జాల వేదికల ద్వారా అభిప్రాయలను పంచి, పత్రికలకు ప్రకటనలు సమర్పించి ఆయా పార్టీల విజయానికి విరివిగానే తమ విలువను జోడించారు. ఇదే పంథాలో సాగినా…ప్రవాస తెదేపా అనుసరించిన వ్యూహం పసికూనలకు కసిసేనల రుచి చూపించింది. సామాజిక న్యాయం సామాజిక మాధ్యమాల్లో కాదు బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఉండాలనే ప్రాథమిక సూత్రానికి తేదేపా పట్టం కడితే, పార్టీ నిర్ణయాన్ని మన్నించి ఆయా వర్గాల వారిని ప్రవాస తెదేపా సమన్వయం చేసిన తీరు అభినందనీయం. దళితాంధ్ర, పౌరుషాంధ్ర, నారా కోసం నారీ, డిజిటల్ ప్రచార రథాలు వంటి ప్రచార సరళి పరికిస్తే – అటు మూల మలేషియా నుండి ఇటు మూల డెట్రాయిట్ మహిళ వరకు – ప్రవాస తెదేపా నవీనతకు వేసిన పెద్దపీట ఎత్తు కొలవకుండానే కనపడుతుంది. ప్రచారంలో పాటలు, వైట్‌బోర్డ్ వివరణలు, టీవీల్లో ప్రత్యక్ష చర్చావేదికల ద్వారా ప్రవాస తెదేపా ఓ అడుగు ముందుకు వేసి ప్రజాకర్షణ విభాగంలో ముందంజ వేసింది.
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, ఎన్నారై తెదేపా నాయకులు వేమన సతీష్ తదితరులతో పాటు అమెరికా, సింగపూర్, దుబాయి, కువైట్, యూకె, లండన్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి ఎంతో మంది ప్రవాసాంధ్రులు ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం నిర్వహించారు. CBN Army, Bangalore TDP forum, Chennai TDP forum, APFirst Team, AP with CBN Team, Be with Babu Team, Pride of Andhra Team, Naari for Naara Team, NRI TDP USA, NRI TDP DALLAS, NRI TDP Australia, NRI TDP Singapore, NRI TDP UK & Europe, NRI TDP Gulf & Kuwait, NRI TDP Malaysia వంటి విభాగాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. రాముడి రాజత్యాగం రామాయణం, భీష్ముడి రాజత్యాగం భారతం లాగా ఈ ఎన్నికల్లో డల్లాస్ ప్రవాస తెదేపా తరఫున ఓ వ్యక్తి చేసిన త్యాగఫలితం మే 23న వార్తల్లో తెదేపా విజయాన్ని లిఖించి చుడుతుంది మరో కొత్త చరిత్రకు శ్రీకారం. అమెరికాలో ఇంట్లో ఇద్దరు చిన్నారులు, భార్యను వదిలేసి కేవలం పార్టీ కోసం నాలుగు నెలల కిందట బెజవాడలో ప్రత్యేకంగా అద్దెకు ఒక ఇల్లు తీసుకుని “మళ్లీ నువ్వే రావాలి” పేరిట ఓ ప్రచార సరళిని ప్రారంభించి ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోర్డు మీద మ్యాపులు, గణాంకాలు, పాటలు, చర్చావేదికల ద్వారా ప్రజాచైతన్యమే పరమావధిగా పనిచేశారు కేసీ చేకూరి. ప్రతిపక్షాలు తన ఫేస్‌బుక్ ఖాతాకు మూతవేయించినప్పటికీ మిత్రుల సహకారంతో మరో కొత్త పేజీని ఏర్పాటు చేసుకుని ప్రచార ప్రవాహం ఎక్కడ ఆగకుండా ఆయన సలిపిన నిరంతర కృషి స్ఫూర్తిదాయకం. సామాజిక మాధ్యమాల్లో తెదేపా గొంతుకగా కేసీ సుపరిచితులు. నాలుగు నెలల కిందట ఆయన అమరావతికి బయల్దేరే ముందు ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 12196. ఎన్నికలు పూర్తి అయ్యేనాటికి ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 19314. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ప్రవాస తెదేపా తరఫున ఆయన ప్రారంభించిన ప్రచార పర్వానికి పెరిగిన అనుచరుల సంఖ్య 7118. అంటే రోజుకి సగటున 60మందిని, గంటకు ముగ్గురు చొప్పున సుదంటు రాయిలా ఆయన ప్రభావితం చేశారు. వీరంతా తెదేపా వారు అనుకుంటే పొరపాటే. తమ లోటుపాట్లు ప్రత్యర్థుల నోటివెంట వినాలనే ఉత్సుకుత ఉన్న ప్రతిపక్షాల వారు కూడా కేసీ అనుసరుల్లో అగ్రభాగాన ఉన్నారు. ఆయన మాటలు తమ చేతలుగా, చేతనగా మారాయంటూ ఎంతో మంది కార్యకర్తలు ఆయనకు ధన్యవాదాలు తెలపడం సాంకేతిక సమజాంలో “ప్రజల వద్దకు చైతన్యం” విజయవంతానికి ప్రవాస తెదేపా అనుసరించిన విధానాలే కారణం. “మా చిన్నప్పుడు వీధికుక్కలు ఎక్కువైతే ఊరిబయటకు తీసుకెళ్లి వదిలేసేవారు. తర్వత కాలంలో కుక్కలకు మత్తు మందిచ్చి దూరప్రాంతాల్లో వదిలేసేవారు. కొంతకాలానికి కుక్కలను స్థానిక ప్రభుత్వాలు మట్టుబెట్టడం మొదలయింది. కానీ ప్రస్తుతం తక్కువకి చంపుతాం. తొందరగా చంపుతాం అనే ప్రకటనలు చూస్తున్నాం. ఇది కేవలం సమాజంలో మితిమీరిన ఆలోచనా సరళికి ప్రతిరూపం. అందుకే నా సందేశాల్లో కొంచెం మోటైన గాఢత ఎక్కువగా కనిపిస్తుంది. అది నేను చెప్పాలనుకునే విషయానికి సంబంధించిన భావాన్ని వ్యక్తపరిచేందుకే గానీ ఆయా వ్యక్తులు లేదా వ్యవస్థల పట్ల నాకు ఎటువంటి ప్రత్యక్ష విరోధం లేదు. ఉండదు కూడా! రాజకీయాల్లో ఆత్మహత్యలే గానీ హత్యలు ఉండవని గట్టిగా నమ్మే వ్యక్తిని నేను. తెదేపాకు సేవ చేయడం సమస్త ఆంధ్రులకు సేవ చేసినట్లు భావిస్తాను. నా ఈ ఎన్నికల ప్రచార వ్యూహరచన వెనుక ప్రాథమికంగా డల్లాస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తెదేపా శ్రేణులు తమ కాలాన్ని, కాసుల్ని ధారపోశారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మా సర్వేల ప్రకారం తెదేపా గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఫలితాలు తారుమారు అయినా ప్రజాపోరాటంలో మొదటి వరుసలో ఉండే మా పాత్రను ఎవరూ చేరుకోలేరు. ఎందుకంటే కలువకు(ప్రజలకు) చంద్రుడు(ప్రభుత్వాలు) దూరమేమో గానీ వెన్నెల(తెదేపా కార్యకర్తలు) కాదు కదా!” అని ఆయన పేర్కొన్నారు.
వచ్చే దశాబ్ద కాలంలో తెదేపా అధినాయకత్వంలో ఎటువంటి మార్పులు సంభవించినా ప్రవాస తెదేపా “మళ్లీ నువ్వే రావాలి” అని నినదించాల్సిందే. పార్టీ అధినాయకత్వం తమ ప్రచార సైన్యాధిపతులైన ప్రవాసాంధ్రులను చూసి “మళ్లీ మీరే రావాలి” అని కోరి తీరాల్సిందే!