DailyDose

జస్టిస్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు

sexual harassment case against indian cji ranjan gogoi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు కలకలం  రేపుతున్నాయి.  

జస్టిస్‌​ రంజన్‌ గోగొయ్‌ గతంలో తనను  లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ  35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు.

సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆరోపణలు చేశారు.

2018 అక్టోబర్‌ 10, 11 తేదీల్లో జస్టిస్‌ గొగోయ్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి,  వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.

ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు న్యాయం  చేయాలని కోరుతో సుప్రీం జడ్జిలను ఆశ్రయించారు. 

ఈ నేపథ్యంలో నేడు (శనివారం, ఏప్రిల్‌20న) సిజేఐ జస్టిస్ రంజన్‌ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

సీజేఐ  రంజన్‌ గొగోయ్‌ స్పందన

ఈ ఆరోపణలను ఖండించిన ప్రధాన నాయ్యమమూర్తి ఇరవై ఏళ్లపాటు నిస్వార్థంగా సేవలందించిన తనపై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానన్నారు. 

తనను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందన్నారు.

న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి వుందంటూ గొగోయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

అఫిడవిట్‌లో ఆమె చేసిన ఆరోపణలు
ఆగష్టు 2018 లో ఆయన ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి.

ఈ వేధింపులను  ప్రతిఘటించిన నేపథ్యంలో  అనుమతి లేకుండా ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్న కారణంగా డిసెంబర్ 21 న సర్వీసులనుంచి తొలగించారు.

అంతేకాదు ఈ సెగ నా కుటుంబాన్ని కూడా చుట్టుముట్టింది. ఢిల్లీలో హెడ్‌ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న నా భర్త, సోదరుడు డిసెంబరు 28, 2018 (పరస్పరం అంగీకారంతో రద్దు చేసుకున్న 2012 నాటి కేసు ఆధారంగా) సస్పెన్షన్‌కు గురయ్యారు.  

జనవరి 11 న, ప్రధాన న్యాయమూర్తి, ఒక మహిళా పోలీసు అధికారి  సమక్షంలో జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణలు చెప్పించారు.  

అలా ఎందుకు చేశారో అర్థంకానప్పటికీ, పై అధికారి సూచలను  అనుసరించాను. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా  వేధింపుల పర్వం ఆగలేదు. 

టెంపరరీ జూనియర్ కోర్టు అటెండెంట్‌గా ఉన్న దివ్యాంగుడైన నాబంధువును  సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆ తరువాత  రాజస్థాన్‌లోని గ్రామానికి వెళ్లిన నన్ను, నా భర్తను,  చీటింగ్‌ కేసులో విచారించాలంటూ మార్చి 9 న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

( 2017లో  ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 50 వేలు తీసుకుని మోసం చేసిందనేది ఆరోపణ). ఆ మరుసటి రోజు తనతోపాటు, భర్త, బావ, ఆయన భార్య, ఇతర బంధువును తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా 24 గంటల పాటు కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి, తిండి, నీళ్లు ఇవ్వకుండా శారీరకంగా హింసించడంతో పాటు దుర్భాషలాడారు.  

ఈ ఆరోపణలకు తోడు  వీటికి సంబంధించి కొంత వీడియో ఫుటేజ్‌ను, ఫోటోలను ఆమె అఫిడవిట్‌లో పొందుపర్చారు. 

అటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఇవి పూర్తిగా తప్పుడు, దురదృష్టకరమైన ఆరోపణలని పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఆమెకు నేర చరిత ఉందని ఆమెపై ఇప్పటికే  రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్నారు.