*ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో పోటీ అంశంపై స్పందించారు ప్రియాంకా గాంధీ. ఇవాళ కేరళలో ప్రియాంకా గాంధీని వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారాఅని విలేకరులు ప్రశ్నించగా..పార్టీ అధ్యక్షుడు పోటీ చేయాలని నన్ను కోరితే..తప్పకుండా సంతోషంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అంతకుముందు మక్కంకున్నులో పుల్వామా అమరజవాన్ వీవీ వసంత్ కుమార్ ను కుటుంబసభ్యులను ప్రియాంకా గాంధీ పరామర్శించారు.
*ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. ఆయా ప్రాంతాల వారీగా ప్రజల ఇష్టాఇష్టాలను తెలుసుకొని మరీ తమ ప్రచారంలో వాటికి చోటుకల్పిస్తున్నారు. తాజాగా ఒడిశాలో భాజపా అభ్యర్థి సంబిత్ పాత్ర తెలుగు పాట పాడి అక్కడి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
*హైదరాబాద్‌లోని చిలకలగూడ గీతానర్సింగ్ హోంలో హేమలత, లక్ష్మణ్ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈనెల 2వ తేదీన కాన్పు జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలలు నిండకముందే జన్మించడంతో ఆ శిశువులను ఆధునిక వైద్యం కోసం విద్యానగర్‌లోని నియో బీబీసీ ఆస్పత్రికి తరలించారు. పుట్టిన సమయంలో కేవలం వెయ్యి గ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు ఆధునిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ శిశువులు 1.3, 1.4 కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు తల్లి పాలు తాగుతున్నట్లు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీరాములు తెలిపారు.
*తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మృత్యవాత పడ్డారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. చైత్రమాస ఉత్సవంలో భాగంగా హుండీలోని చిల్లరను భక్తులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో నాణేల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడమే ఈ తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. మృతులు కరూర్, కడలూరు, సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ఆలయంలో ఏటా ఘనంగా జరిగే ఉత్సవం కావడంతో ఆదివారం నాడు భక్తులు పోటెత్తారు.
*తమిళనాట సీజ్ చేసిన తితిదేకి చెందిన బంగారు నగలు శనివారం సాయంత్రం శ్రీవారి ఖజానాకు చేరాయి. ఈనెల 17న వ్యానులో తరలిస్తున్న 1,381 కేజీల బంగారు నగలను చెన్నై శివారులో ఎన్నికల నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
*పంచాయతీ కార్యదర్శుల (గ్రేడ్-4) నియామకానికి సంబంధించిన రాత పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. 13 జిల్లాల్లో కలిపి 1320 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
*విజయవాడ డివిజన్ పరిధిలో సాంకేతిక పనుల కారణంగా కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ- కోటిపల్లి రైల్‌బస్ ఏప్రిల్ 21 నుంచి జులై 20 వరకు రద్దైంది. రాజమహేంద్రవరం-నిడదవోలు మధ్య కొన్ని పాసింజరు రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.
*భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 6న ప్రారంభమైన శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. అహోబిల రామానుజ జీయర్‌స్వామి సమక్షంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలతోపాటు సుదర్శన చక్రానికి అభిషేక మహోత్సవం నిర్వహించారు. సుదర్శన చక్రాన్ని అర్చకులు శిరస్సుపై ధరించి గోదావరిలో పూజలు నిర్వహించి చక్రతీర్థ పూజలు చేశారు. ఆలయంలో రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణాలను ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించనున్నామని ఈవో రమేశ్‌బాబు తెలిపారు.
*నల్లమల అడవుల్లో వెలసిన సలేశ్వరం క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన చైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచీ భక్తులు తరలివచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పున్నమి వెన్నెల్లో కాలినడకన ప్రయాణం సాగించి శివయ్య సన్నిధికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు అటవీ శాఖ అనుమతులు ఆదివారంతో ముగియనుండడంతో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
*తెలంగాణ ఎంసెట్‌కు శనివారం నాటికి 2.16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య ఎన్.యాదయ్య తెలిపారు. ఇంజినీరింగ్‌కు 1,41,716, అగ్రికల్చర్, ఫార్మసీకి విభాగాలకు 74,880 దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుందన్నారు. తెలంగాణను 15, ఆంధ్రప్రదేశ్‌ను 3 జోన్లుగా విభజించి వాటిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ మే 3, 4, 6 తేదీల్లో, అగ్రికల్చర్ విభాగం 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాల్‌టికెట్లను నెట్‌లో పొందుపరిచామని, అభ్యర్థులు మే 1లోపు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలను ముందుగానే చూసుకోవాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోందని యాదయ్య వివరించారు. అదనపు వివరాలకు వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in వీక్షించవచ్చన్నారు.
*తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై సివిల్, ఐటీ, ఏఎస్సై ఫింగర్‌ప్రింట్ బ్యూరో పోస్టులకు రాత పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఆంగ్ల భాషపై పరీక్షలు జరిగాయి. ఎస్సై సివిల్ పోస్టులకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో, ఎస్సై ఐటీ, ఏఎస్సై ఎఫ్‌పీబీ పోస్టులకు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
*కర్ణాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొప్పల్ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి తరపున చంద్రబాబు ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి వనరులు ఎక్కువగా ఉన్నందున.. కర్ణాటకలో చాలా మంది తెలుగువాళ్లు స్థిరపడ్డారన్నారు. తుంగభద్ర డ్యామ్‌లో పూడికతీతపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడి నీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్ప న్యాయం జరగదన్నారు.
*శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కొలంబోలో జరిగిన వరుస బాంబు దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. అయితే శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లలో 185మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటన చేసింది. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నట్లు పేర్కొంది.
*ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తన మెసెంజర్ సేవలను మే 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (బీబీఎం) సేవలు యూజర్లకు లభ్యం కావని ఆ కంపెనీ తెలిపింది. చాలా మంది యూజర్లు ప్రస్తుతం పలు భిన్నమైన ఇన్‌స్టంట్ మెసెంజర్‌లను వాడుతున్నారని, అందుకే బీబీఎం సేవలను నిలిపివేస్తున్నామని బ్లాక్‌బెర్రీ తెలిపింది. అయితే కొత్తగా బ్లాక్‌బెర్రీ మెసెంజర్ ఎంటర్‌ప్రైజ్ (బీబీఎంఈ) పేరిట మరో నూతన మెసేజింగ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చామని బ్లాక్‌బెర్రీ తెలిపింది. దీన్ని వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు వాడుకోవచ్చని, మొదటి సంవత్సరం ఈ యాప్ సేవలు ఉచితంగానే లభిస్తాయని, తరువాత 6 నెలల సబ్‌స్క్రిప్షన్‌కు 2.49 డాలర్లు (దాదాపుగా రూ.172) చెల్లించాల్సి ఉంటుందని బ్లాక్‌బెర్రీ తెలిపింది. బీబీఎంఈలో యూజర్ల మెసేజ్‌లకు ప్రైవసీ, సెక్యూరిటీ ఉంటాయని, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లో మెసేజ్‌లు వెళ్తాయని బ్లాక్‌బెర్రీ తెలిపింది.
తెలంగాణ ఎంసెట్‌కు 2.16 లక్షల దరఖాస్తులు-తాజావార్తలు–04/21
Related tags :