Food

తస్సాదియ్యా…తీపి గుమ్మడి బూరెలు

sweet pumpkin snacks gummadi boorelu easy short recipe

*** కావల్సినవి:
తీపి గుమ్మడి తురుము- కప్పు, బెల్లం తురుము- కప్పు, యాలకుల పొడి- చెంచా, జీడిపప్పు పలుకులు- టేబుల్‌స్పూను, నెయ్యి- పావు కప్పు, మినప్పప్పు- కప్పు, బియ్యం- రెండు కప్పులు, ఉప్పు- చిటికెడు, నూనె- వేయించేందుకు సరిపడా.

*** తయారీ:
మినప్పప్పూ, బియ్యం కలిపి నాలుగంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. గుమ్మడి తురుమును శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి దానిపైన బరువు పెట్టాలి. కాసేపటికి అందులోని తడి పోతుంది. తరవాత పొయ్యిమీద బాణలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి గుమ్మడి తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. దానికి బెల్లం తురుము వేసి కలుపుతూ ఉంటే కాసేపటికి అది గట్టిపడుతుంది. అప్పుడు అందులో యాలకుల పొడీ, వేయించిన జీడిపప్పు పలుకులూ కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత ఈ పూర్ణాన్ని నిమ్మకాయ పరిమాణంలో ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా రుబ్బిపెట్టుకున్న పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. పూర్ణం ఉండల్ని ఒక్కోటి చొప్పున ఆ పిండిలో ముంచి కాగే నూనెలో వేసి వేయించి తీసుకోవాలి.