అగ్ర రాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఒకరి వ్యాపారాన్ని మరొకరు దెబ్బ తీసేందుకు సుంకాల కత్తులు దూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఎదురవుతున్న పన్నుల ఒత్తిడిని తట్టుకునేందుకు చైనా తయారీదారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. చైనాలో తయారయ్యే ప్రతి వస్తువుల్లో అత్యధిక భాగం విదేశాలకు ఎగుమతి అవుతుంది. నాణ్యత విషయాన్ని పక్కన పెడితే, అత్యంత చౌకగా లభిస్తుండటంతో విదేశాల్లోని వ్యాపారులు ఎక్కువగా చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో అమెరికా-చైనాల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై పెద్దన్న అమెరికా సుంకాలను విపరీతంగా పెంచింది. దీంతో తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు చైనాలోని తయారీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వస్తువులను విక్రయించుకోవడానికి డిస్కౌంట్‌లు, వివిధ పన్నులపై రాయితీలు, శ్రామికులను తగ్గించుకోవడం, వేరొక దేశంలో తమ వస్తువులను ఉత్పత్తి చేయడం ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని చైనా కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. పన్నుకు పన్ను పద్ధతిలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అనేక వస్తువులు ప్రియమయ్యాయి. దీనికి తోడు యూరోపియన్ యూనియన్ డ్యూటీలు సైతం చైనా కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ బైక్‌లు, సోలార్ ప్యానెల్స్‌పై వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, మార్చి గణాంకాలను పరిశీలిస్తే, చైనా వస్తువుల తయారీదారులకు ప్రోత్సాహకరంగానే ఉంది. 2014 తర్వాత ఎగుమతులు సైతం అంచనాలను దాటుకుని వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. కానీ, అమెరికా మార్కెట్‌పై ఆధారపడి వస్తువులను తయారు చేస్తున్న కంపెనీలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ఈ వాణిజ్య యుద్ధానికి తెరపడకపోతే, ఎలా ముందుకు సాగాలో కూడా ఆయా కంపెనీలు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
తీవ్ర వాణిజ్య ఒత్తిడిలో చైనా
Related tags :