Politics

ఒరిస్సాలో ఎవరిది గెలుపు?

orissa 2019 election predictions and analysis

తూర్పు తీర రాష్ట్రం ఒడిశాలో జరుగుతున్న జమిలి ఎన్నికలు అధికార బిజు జనతాదళ్‌(బిజద), ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పట్టు నిలుపుకోవాలని బిజద, సత్తా చాటాలని భాజపా, గతవైభవం సాధించాలని కాంగ్రెస్‌ శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అంతా తానే అయ్యి ప్రచారం సాగిస్తుండగా, భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో వరుసగా నాలుగు సార్లు అధికారం చేపట్టిన నవీన్‌ పట్నాయక్‌(72) తన ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా…ప్రత్యేక బస్సులో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజూ రోడ్‌ షోలు నిర్వహిస్తూ 4, 5 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ పర్యటనల్లో రెండు లేదా మూడు నిమిషాలే మాట్లాడుతున్నారు.
****నవీన్‌ ప్రసంగాల్లో ముఖ్యాంశాలు
* కేవలం నేను మీ సంతోషం కోసమే ఉన్నాను. నన్ను గెలిపించి సంతోషపరచండి.
* ఒడిశాపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది.
* రాష్ట్రం ద్వారా రైల్వే శాఖ, బొగ్గు ఉత్పత్తి ద్వారా కేంద్రం రూ.వేల కోట్లు ఆర్జిస్తూ తిరిగి రాష్ట్రానికి కేటాయించేది అతి స్వల్పంగా ఉంటోంది.
* ఎన్నికలప్పుడే రాష్ట్రాన్ని సందర్శించే కేంద్ర మంత్రులు.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కన్నెత్తి కూడా చూడరు.
* ఈసారి కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు. మనమే కేంద్రంలో నిర్ణయాత్మక/కీలక పాత్ర వహిస్తాం.
***కనిపించని వ్యతిరేకత
రాష్ట్రంలో 19 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న సీఎం నవీన్‌ పట్నాయక్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదు. ‘‘నవీన్‌ బాబు మాకోసమే పని చేస్తున్నారు. అయన ఉన్నన్ని రోజులూ ఆయనకే మా ఓటు’’అని అంటున్నారు భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మాధవ్‌ బెహ్రా. ఇదే ఇక్కడి మెజారిటీ ప్రజల అభిప్రాయం అని చెబుతున్నారు. నవీన్‌ రాష్ట్ర ప్రజల కోసం అంకితమైన తీరు, నిబద్ధతే ఆయన గెలుపునకు కారణం అంటున్నారు కటక్‌కు చెందిన రోజువారీ కూలీలు, వర్తకులు.
***ప్రధాని, కేంద్రమంత్రుల పర్యటనలు
ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో నాలుగుసార్లు సుడిగాలి పర్యటన చేశారు. ఈ నెల 23న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు ఇంచుమించు ప్రతిరోజూ కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కియోంఝర్‌, మయూర్‌భంజ్‌ జిల్లాల్లో పర్యటించి.. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కటక్‌ జిల్లాలోని కిసాన్‌ నగర్‌, బరిపొడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భాజపాకు ఒక్కసారి అవకాశం ఇస్తే కొత్త తరహా పాలన చూస్తారని పేర్కొన్నారు. శనివారం కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి భద్రక్‌, కేంద్రపర లోక్‌సభ నియోజక వర్గాలలో ప్రచారం నిర్వహించారు. ఇంకోపక్క స్థానిక నాయకులూ చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, భాజపా అధికారంలోకి వస్తే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండి డబుల్‌ ఇంజిన్‌లాగా ముందుకు దూసుకెళ్తామని చెబుతున్నారు.
* రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
* ఇప్పటికే రెండు విడతల్లో 9 లోక్‌సభ, 63 విధానసభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.
* మరో 12 లోక్‌సభ, 84 అసెంబ్లీ సీట్లకు మూడు, నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
* మొదటి విడతలో 66 శాతం, రెండవ విడతలో 72 శాతం పోలింగ్‌ నమోదైంది.
****పోటీలో కొత్తముఖాలు
తన ఎమ్మెల్యేలు, ఎంపీలపై వ్యతిరేకత రావడంతో ఈసారి నవీన్‌ పట్నాయక్‌ సీట్ల కేటాయింపులో భారీ మార్పులు చేశారు. చాలా మంది సిటింగ్‌ల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా వ్యతిరేకతను దూరం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారు. అటు భాజపాలోనూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తమ సర్వీసులను వదులుకొని పోటీ చేస్తుండటం గమనార్హం.
* భువనేశ్వర్‌లో మాజీ ఐపీఎస్‌ అధికారి అరూప్‌ పట్నాయక్‌, మాజీ ఐఏఎస్‌ అధికారిణి అపరాజిత షడంగి పోటీ పడుతున్నారు.
* కటక్‌ లోక్‌సభ స్థానం నుంచి మాజీ డీజీపీ ప్రకాష్‌ మిశ్రా బరిలో ఉన్నారు.
* రాష్ట్ర వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో కార్యదర్శిగా ఉన్న నళినీ కాంత ప్రధాన్‌ తన సర్వీసుకు రాజీనామా చేసి బిజదలో చేరారు. ప్రస్తుతం సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
* రాష్ట్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్న శర్మిష్ఠ సేఠీ బిజదలో చేరి జాజ్‌పూర్‌ లోక్‌సభ సీటు నుంచి అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు.
* మాజీ ఐఏఎస్‌ అధికారి రమేష్‌ చంద్రసాయి బిజద నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
* పలువురు మీడియా ప్రముఖులూ ఈసారి ఎన్నికల్లో భాజపా తరఫున బరిలో ఉన్నారు.
***పుంజుకోనున్న భాజపా?
ఈసారి భాజపా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ ప్రభావంతో గతంలో కన్నా ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
**వెనుకబడిన కాంగ్రెస్‌
గత ఎన్నికల్లో 16 శాసనసభ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి ప్రచారంలో వెనుకబడిపోయింది. రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పటికీ స్థానిక నాయకత్వ లోపంతో ప్రజల్లోకి దూసుకెళ్లలేకపోతోంది.