పవిత్ర ఈస్టర్ పర్వదినమైన ఆదివారం శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లతో దాదాపు 290 మంది మరణించారు. 500 మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశముందని శ్రీలంక అధికారులు వెల్లడించారు. అయితే ఈ పేలుళ్లలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు సేవలందించేందుకు వైద్య బృందాన్ని అక్కడకు పంపాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలోని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 మంది వైద్య నిపుణలతో కూడిన ఈ బృందం పేలుళ్ల బాధితులకు వైద్యసేవలు అందించనుంది. వైద్యులు అత్యవసరంగా అక్కడకు చేరుకునేందుకు సహకరించాలని భారత విదేశాంగ శాఖను కేరళ ప్రభుత్వం కోరింది. శ్రీలంకలో ఇలాంటి మారణహోమం చోటు చేసుకోవడంతో ప్రపంచ దేశాలు శ్రీలంకకు బాసటగా నిలుస్తున్నాయి. ఘటనపై సమాచారం అందిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలకు ఫోన్ చేసి సానుభూతి తెలియజేశారు. శ్రీలంకకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ దాడులతో సంబంధమున్న 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి రువన్ గుణశేఖర తెలిపారు. ఈ పేలుళ్ల ఘటనలో ఆరుగురు భారతీయులతో పాటు 32 మంది విదేశీయులు మరణించినట్లు సమాచారం.
శ్రీలంకకు కేరళ సహాయ బృందాలు
Related tags :