”నేను ప్రధాన మంత్రి అవుతానని అసలు ఊహించలేదు. ప్రధాని కావాలని నేనెప్పుడూ కలగనలేదు. కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నా. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను. నేనే కఠినంగా ఉంటాను. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోను.” అని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 7లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్రమోదీతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు మోదీ సమాధానాలిచ్చారు. ముఖాముఖీ ముఖ్యాంశాలు మోదీ మాటల్లోనే.. సన్యాసి జీవితాన్నే నేను ఇష్టపడతాను. నేను పనిచేస్తూ.. మిగతా వారందరితో పని చేయిస్తాను. నాతో సమావేశాల్లో ఎవరూ మొబైల్ ఫోన్లు ఉపయోగించరు. అలాగే నేను కూడా ఎవరితోనైనా భేటీ అయినప్పుడు ఫోను వాడను. ప్రముఖుల బయోగ్రఫీలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. పెద్దపెద్ద వాళ్లను కలవడం కంటే.. చిన్న పిల్లలను కలవడమే చాలా కష్టం. రామకృష్ణ మిషన్ నాకు స్ఫూర్తి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటా. నేను అందరితో సరదాగా గడపాలని భావిస్తాను. అధికారులందరికీ నేను ఓ స్నేహితుడిని. రాజకీయాల కంటే ఇతర విషయాలపై మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టపడతా. విపక్ష నేతల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. స్కూల్ సమయంలో బ్యాంక్ ఖాతా తెరిచినా డబ్బులు వేయలేదు. 32 సంవత్సరాలు జీరో బ్యాలెన్స్‌తో అది కొనసాగింది. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ వెళ్లి అమ్మను కలిసి వస్తాను. కష్టపడి జీవించడమే మన సంస్కృతి. సోషల్ మీడియాలో నాపై జోకుల్ని వేస్తే ఎంజాయ్ చేస్తుంటాను. జోకుల్లో ఉన్న క్రియేటివిని నేను చూస్తాను. చాలా మంది ప్రధానులకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. గుజరాత్ రాష్ర్టానికి సీఎంగా నేను ఎక్కువ కాలం పనిచేశాను. ఏ ప్రధానికి దక్కని గొప్ప అవకాశం నాకు దక్కింది. మాజీ ప్రధాని దేవెగౌడ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ కొంతకాలమే ఆ పదవిలో ఉన్నారు. సీఎంగా పనిచేసిన అనుభవం నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఎలాంటి ఒడిదొడుకులు, ఒత్తిడిలేకుండా నా బాధ్యతలు నెరవేరుస్తున్నా. నేను మూడున్నర గంటలకు మించి నిద్రించను. ఎక్కువ సమయం నిద్రించాలని చాలా మంది నాకు చెప్పారు. కానీ.. నాకు అది అలవాటైపోయింది. రిటైర్మెంట్ తర్వాత నిద్రపై దృష్టిపెడతాను. చిన్న బ్యాగ్ పట్టుకుని ప్రయాణాలు చేసేవాడిని. సీఎం అయ్యే వరకూ నా దుస్తులు నేనే ఉతుక్కునే వాడిని. ఇప్పటికీ మా అమ్మ నాకు డబ్బులు ఇస్తుంది అని మోదీ పేర్కొన్నారు.
నేను ప్రధాని అవుతానని కలగనలేదు
Related tags :