ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగిన కొన్నింటిని మాత్రమే మనం గుర్తించగలం. అలాంటి ఓ ఘటనే యూఏఈలో జరిగింది. దుబాయ్‌కు చెందిన ఓ మహిళ 27 ఏళ్ల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చింది. బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సదురు మహిళను ఆమె కుమారుడు కంటికి రెప్పల చూసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత ఆ మహిళ స్పృహలోకి రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే.. 1991లో 32 ఏళ్ల మునీరా తన కుమారుడు ఒమర్‌ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకువస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో మునీరా తన కుమారుడిని గట్టిగా అలుముకోవడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 4 ఏళ్ల ఒమర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే మునీరా బ్రెయిన్‌కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా, వైద్యులు మాత్రం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. మళ్లీ కళ్లు తెరిచే అవకాశం లేదని తెలిపారు. కానీ మునీరా కుటుంబ సభ్యులు నమ్మకం కోల్పోలేదు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు యూఏఈ ప్రభుత్వం ఆమెను చికిత్స నిమిత్తం లండన్‌కు పంపింది. చికిత్స అనంతరం ఆమెను తిరిగి స్వదేశానికి తరలించారు. అక్కడి హాస్పిటల్‌లో మునీరాకు చాలా ఏళ్ల పాటు ట్యూబ్ ద్వారా ఫీజియోథెరపి నిర్వహించారు. తల్లి చికిత్స కోసం ఒమర్ ఎంతగానో శ్రమించారు. చివరకు 2017 ఏప్రిల్‌లో మునీరా పరిస్థితిని సమీక్షించిన క్రౌన్ ప్రిన్స్ కోర్టు ఆమెను జర్మనీ తీసుకెళ్లి చికిత్స చేయించడానికి అవకాశం కల్పించింది. అక్కడ కొన్ని సర్జరీలు నిర్వహించిన వైద్యులు, మెరుగైన చికిత్స అందించారు. ఇలా ఒక ఏడాది గడిచిన తర్వాత ఇంకో వారంలో జర్మనీలో మునీరా ట్రీట్‌మెంట్ ముగుస్తుందన్న సమయంలో అద్భుతం జరిగింది. 2018 జూన్‌లో ఆమె చికిత్స పొందుతున్న గదిలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే ఇదే సమయంలో మునీరాలో కదలిక ప్రారంభమైంది. ఆమె గొంతు నుంచి వింత శబ్దాలు రావడంతో.. ఒమర్ వెంటనే వైద్యుల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత మునీరాను పరీక్షించిన వైద్యులు అంత నార్మల్‌గానే ఉందని తెలిపారు. ఇది గడిచిన మూడు రోజులకు ఒమర్‌కు తన పేరును ఎవరో పిలిచినట్టు వినబడింది. తీరా చూస్తే పిలిచింది మునీరానే కావడంతో ఒమర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 27 ఏళ్లుగా తను దేని కోసమైతే కళ కన్నాడో అది నిజం కావడంతో పట్టరాని సంతోషంతో పొంగిపోయారు. తర్వాత కుటుంబంతో కలిసి తిరిగి అబుదాబి చేరుకున్న మునీరాకు ప్రస్తుతం ఫీజియోథెరపి చేస్తున్నారు. ఒమర్ అప్పుడప్పుడు మునీరాను వీల్‌చైర్‌లో ఉంచి మసీదులకు కూడా తీసుకుని వెళ్తున్నారు. మునీరా నెమ్మదిగా కోలుకుంటున్నట్టు ఆమె చికిత్స పొందుతున్న హాస్పిటల్ యాజమాన్యం గత నెలలో విడుదల చేసిన మెడికల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయాల్ని ఒమర్ ‘ది నేషనల్’తో పంచుకున్నారు. ‘ఇప్పుడు అమ్మ కథను చెప్పడానికి ఓ కారణం ఉంది. ఎవరైనా సరే తమకు ఇష్టమైన వారిమీద ఆశలు వదలుకొవధ్దు. ప్రమాదం జరిగిన సమయంలో నా తల్లి వెనుక సీటులో కూర్చుని ఉంది. ప్రమాదం జరుగుతున్న సమయంలో వెంటనే నన్ను గట్టిగా హత్తుకుని కాపాడింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా నేను ఏ రోజు కూడా అమ్మ మీద ఆశ వదులుకోలేదు. ఆమె ఏదో ఒక రోజు కోలుకుంటుందనే నమ్మకం నాలో ఎప్పుడు ఉండేది. నాకు అమ్మ బంగారం లాంటింది. ఎంతో విలువైన అమ్మకోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. దీనికి నేను బాధపడటం లేద’ని తెలిపారు.
పాతికేళ్ల తర్వాత కోమా నుండి బయటకు
Related tags :