Movies

ఆస్వాదించడం అన్నిటికంటే ముఖ్యం

enjoy the moment says keerthy suresh

‘‘ప్రణాళికలు అవసరమే కానీ… అదే పనిగా భవిష్యత్తు గురించి ఆలోచించను. చేస్తున్న పనిని ఆస్వాదించడం అన్నిటికంటే ముఖ్యం అని నమ్ముతా’’ అంటోంది కీర్తి సురేష్‌. ‘మహానటి’గా మెరిసిన కీర్తి, ఆ తర్వాత వాణిజ్య ప్రధానమైన పలు చిత్రాలతో సందడి చేసింది. ప్రస్తుతం మళ్లీ కథాబలమున్న చిత్రాలతో ప్రయాణం చేస్తోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకొంటోంది. ఎప్పుడు ఎలాంటి కథలు చేయాలనే విషయంలో ప్రత్యేకంగా వ్యూహాలేమైనా రచిస్తుంటారా? అని కీర్తిని అడిగితే… ‘‘నా దగ్గరికి వచ్చిన కథల్నే కదా నేను ఎంచుకోవాల్సింది? ఇక నేను ఎన్ని వ్యూహాలు రచించినా ఏం ఫలితం ఉంటుంది?’’ అని బదులిచ్చింది. ‘‘ఒక ప్రణాళిక ప్రకారం కెరీర్‌ని నడిపించాలనేది అందరూ చెప్పే మాటే. అయితే అది ఒక్క కథల ఎంపికలోనే కాదని నా అభిప్రాయం. కథల గురించి లెక్కలేసుకోవడం మొదలు పెడితే… భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనీ చేయలేం. ముందు వచ్చిన అవకాశాలకి నా వంతు న్యాయం చేసి, ఆ పాత్రలపై నాదైన ప్రభావం ఉండేలా చూసుకుంటా. నా పనితీరే నా దగ్గరికి మంచి కథల్ని, మంచి పాత్రల్ని తీసుకొస్తుందని నమ్ముతా’’ అని చెప్పింది కీర్తి.