తెలంగాణ ఇంటర్‌బోర్డు వ్యవహారంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ప్రగతి భవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష తప్పితే జీవితం ఆగిపోదని.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ సూచించారు. ఇంటర్ బోర్డుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నందున ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ఇంటర్‌బోర్డును ఆదేశించారు. పాసైన విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరినా చేయాలని.. ఈ అంశంలో గత విధానమే పాటించాలని సీఎం సూచించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంటర్ ఫలితాల గందరగోళం విషయంలో బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌పై ఎక్కువగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి సీఎం అప్పగించారు. పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాల్ని ఖరారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇంటర్ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై అధికారులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇ-ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు సీఎంకు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిఫుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదింపు చేసిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని అధికారులు కేసీఆర్‌కు తెలిపారు.
ఉచిత రీ-వెరిఫికేషన్ జేస్తం
Related tags :