DailyDose

రిలయన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు-వాణిజ్యం-04/24

softbank invests in reliance

Ø రిలయన్స్‌ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 2-3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14,000-21,000 కోట్లు) పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. రిలయన్స్‌ జియోలో వాటాలు విక్రయించాలని సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ భావిస్తుండడం ఇందుకు నేపథ్యం.
Ø అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ, చిన్న కారు ఆల్టో 800లో కొత్త వెర్షన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ధరల శ్రేణి రూ.2.93- 3.71 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.
Ø రెక్కలు లేని సరికొత్త ఫ్యాన్లను డోమెక్‌ సొల్యూషన్స్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమెరికాకు చెందిన ఎక్స్‌హాల్‌ కంపెనీ రూపొందించిన ఈ ఫ్యాన్లకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది.
Ø ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌సీఐఎల్‌) మంగళవారం ఓ సరికొత్త కారును విపణిలోకి విడుదల చేసింది. తన వాహన శ్రేణిలోని కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ అప్‌గ్రేడ్‌ చేసి తీసుకొచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఇది లభిస్తుండగా, పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.8.56లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.9.56లక్షలుగా నిర్ణయించారు.
Ø మనదేశం నుంచి 2018-19లో ఔషధ ఎగుమతులు 11 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2018-19) లో 19.15 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.34 లక్షల కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి.
Ø పీర్‌లెస్‌ జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వద్ద ఉన్న మదుపర్లకు చెందిన రూ.1514 కోట్ల డిపాజిట్లు 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. మదుపర్ల విద్య, రక్షణ నిధి(ఐఈపీఎఫ్‌)కు వీటిని ఆ కంపెనీ బదీలీ చేసినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Ø జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడి పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన అట్మాస్పియర్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జాసన్‌ అన్స్‌వర్త్‌ ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
Ø శ్రీరామ్‌ గ్రూప్‌ కంపెనీల్లో తన వాటాలు విక్రయించడం ద్వారా నిష్క్రమించాలని అజయ్‌ పిరమాల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రాథమికంగా ఆనంద్‌ మహీంద్రా తదితరులతో చర్చలు చేపడుతున్నారని వార్తలొచ్చాయి. ఆర్థిక సేవల రంగంలో అనుకున్న లక్ష్యాలను చేరలేకపోవడం ఇందుకు కారణమని ఈ విషయాలతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు.
Ø ముడిచమురు భయాలు కొనసాగడంతో వరుసగా మూడో రోజూ సూచీలకు నష్టాలు తప్పలేదు. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
Ø జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా రూ.250 కోట్ల వరకు ఎఫ్‌ఎంసీజీ సంస్థ పీఅండ్‌జీ ఇండియా అక్రమంగా లాభాలు ఆర్జించిందని జీఎస్‌టీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. స్టాండింగ్‌ కమిటీ వద్ద దాఖలైన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ (డీజీఏపీ) ఈ తనిఖీలు నిర్వహిచింది.
Ø సూక్ష్మ రుణ సంస్థ నుంచి రెండేళ్ల క్రితం బ్యాంకుగా మారిన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దశల వారీగా 25 శాఖలు ఏర్పాటు చేస్తామని, ద్వితీయ శ్రేణి పట్టణాలను లక్ష్యంగా చేసుకుంటామని సూర్యోదయ్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాస్కర్‌ బాబు తెలిపారు.
Ø ఎరువులు, నూట్రినెంట్స్‌ తయారు చేసి విక్రయించే సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.110 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
Ø వచ్చే వారంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలంటూ ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వీడియోకాన్‌కు రుణ మంజూరు వ్యవహారం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వీరికి ఈ సమన్లు పంపారని అధికారులు తెలిపారు.