Politics

గవర్నర్‌ను కలిసిన తెలంగాణా ప్రతిపక్షాలు

telangana opposition meets governor to rescue inter students

తెలంగాణ ఇంటర్‌ బోర్డు వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోయారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతో సుమారు 20 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం, తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై గవర్నర్‌తో అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. ఉత్తమ్‌తో పాటు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, షబ్బీర్‌ అలీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంతో లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని కోరామని ఉత్తమ్‌ చెప్పారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని.. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గవర్నర్‌ను కోరినట్లు ఉత్తమ్‌ చెప్పారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని.. విద్యార్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తీసుకొవద్దని సూచించారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన అంశాన్ని ఉద్దేశించి ఉత్తమ్‌ మాట్లాడారు. నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను తెరాస కొనుగోలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.