Business

రెండు రెట్లు పెరిగాయి

smartphone number doubled in india

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య 2023 నాటికి 40శాతం పెరుగుతుందని, అదే విధంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు రెండింతలు అవుతారని మెకిన్సే తన నివేదికలో వెల్లడించింది. 2013 నుంచి అంతర్జాల సేవలు, డేటా టారిఫ్‌ల ధరలు తగ్గముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇక 2025 నాటికి డిజిటల్‌ రంగం వ్యాపారం రెండింతలు పెరిగి 355-435బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ‘డిజిటల్‌ ఇండియా-టెక్నాలజీ టు ట్రాన్స్‌ఫార్మ్‌ ఎ కనెక్షన్‌ నేషన్‌’ పేరిట మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఈ నివేదికను తయారు చేసింది. 2018 చివరి నాటికి భారత్‌లో 560మిలియన్ల ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. భారత్‌లో మొబైల్‌ డేటా వినియోగం నెలకు సగటున 8.3జీబీగా ఉంది. చైనాలో ఇది 5.5జీబీగా ఉండగా డేటా వినియోగంలో మూడు అడుగులు ముందే ఉంది. ఇక మొబైల్‌ ఫోన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ 1.2బిలియన్‌ ఉండగా, 2018లో మొత్తం 12.3 బిలియన్‌ల యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న 17దేశాల్లో అధ్యయనం చేయగా, భారత్‌లో వృద్ధి గణనీయంగా ఉంది’ అని మెకిన్సే చెప్పింది. డిజిటలీకరణలో ప్రభుత్వ పాత్ర కూడా విశేషంగా ఉందని తెలిపింది. డేటా ధరలు తగ్గడంలో, ప్రైవేటు టెలికాం సంస్థ అయిన జియో కీలక పాత్ర పోషించిందని పేర్కొంది.