తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా వృద్ధి సాధిస్తుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు 50 మెగావాట్లు మాత్రమే ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి నేడు 3,500 మెగావాట్లకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రెన్యూఎక్స్ 2019 ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. సౌర విద్యుత్ ఉత్పాదనలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రం సోలార్ పవర్ పార్కుల విధానం కాకుండా వికేంద్రీకృత సోలార్ విధానాన్ని అనుసరిస్తుందని తద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని 2017 లో 32 కోట్లు, 2018లో 40 కోట్లు నాటి జియో ట్యాగింగ్ సాంకేతికతతో అనుసంధానించి వాటి ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ అండ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, కేంద్ర ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ డిప్యూటీ సెక్రటరీ అగుజిందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక ఇంధన వనరుల రంగానికి చెందిన పారిశ్రామిక వేతలు వంద స్టాల్స్ వరకు ఏర్పాటు చేశారు.
తెలంగాణాలో సౌరవిద్యుత్ వృద్ధి అద్భుతంగా ఉంది
Related tags :