WorldWonders

హైదరాబాద్ బస్సు మహరాష్ట్రలో తుక్కు అయింది

telangana stolen rtc becomes scrap metal in nanded under 12hours

హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ వద్ద నుంచి దొంగిలించిన సిటీ బస్సును అఫ్జల్‌గంజ్‌ పోలీసులు నాందేడ్‌లో గుర్తించారు. నాందేడ్‌ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంకిడి గ్రామం వద్ద ఈ బస్సు నామరూపాల్లేకుండా కనిపించింది. కుషాయిగూడ డిపోకు చెందిన సిటీ బస్సును డ్రైవర్‌ వెంకటేష్‌ మంగళవారం రాత్రి ఎంజీబీఎస్‌కు తీసుకువచ్చాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు బస్సును స్టార్ట్‌ చేసి బయటకు తీసుకుపోయారు. బుధవారం ఉదయానికి బస్సు మాయమైనట్లు తెలియడంతో గగ్గోలు రేగింది. వెంటనే ఆర్టీసీ అధికారులు పోలీసులను సంప్రదించారు. డీఐజీ ఎం.రమేష్‌రెడ్డి ఆర్టీసీ అధికారులతో చర్చించారు. వాహనాలను తుక్కు కింద మార్చే మెకానిక్‌ షెడ్లు ఎక్కడున్నాయో ఆరా తీశారు. విజయవాడ, నాందేడ్‌, కర్నూలు, అనంతపురం, బీదర్‌లలో ఉన్నట్టు గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ఆయా మార్గాల్లోని టోల్‌గేట్ల సిబ్బందిని విచారించారు. మహారాష్ట్రకు చెందిన ఫరూక్‌ ముఠా బస్సులను ఎత్తుకెళ్లి ముక్కలుగా చేసి విడి భాగాలను విక్రయిస్తుంటుంది. ఆ కోణంలో కూడా పోలీసులు దృష్టి పెట్టగా నిజామాబాద్‌ నుంచి బాసర మీదుగా నాందేడ్‌కు ఆ బస్సును తీసుకెళ్లినట్టు టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. అక్కడి పోలీసుల నుంచి కూడా బస్సు గురించిన సమాచారం రావడంతో అఫ్జల్‌గంజ్‌ పోలీసులు బయలుదేరి వెళ్లారు. అయితే వీరు వెళ్లేసరికే దుండగులు బస్సు టాప్‌ మొత్తం తీసేశారు. సీట్లు కూడా తొలగించారు. తాము అక్కడికి చేరుకోవడం ఆలస్యమైతే టైర్లతో సహా ఇతర ప్రాంతాలకు తరలించేవారని డీఐజీ రమేష్‌రెడ్డి తెలిపారు. భైంసా దాటిన తరవాత దారిలో గేర్‌ రాడ్‌ విరిగిపోయి బస్సు కదలకపోవటంతో 60 కిలోమీటర్ల దూరంలోని నాందేడ్‌ నుంచి క్రేన్‌ తెప్పించి మరీ కింకిడి గ్రామానికి బస్సును తరలించారు. అక్కడ పెద్దపెద్ద భవనాల నిర్మిస్తున్న ప్రాంతానికి చేర్చారు. అప్పటికే పెద్దసంఖ్యలో సిద్ధంగా ఉన్న మెకానిక్‌లు బస్సు బాడీని ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. ఇంజిన్‌లోని భాగాలను వేరు చేసే పనిలో ఉండగా అఫ్జల్‌గంజ్‌ పోలీసులు, తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు మాయమైన ఘటనపై రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆర్టీసీ అధికారులతో సమావేశమైన ఆయన భద్రతా లోపాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలలో భద్రతా లోపాలను గుర్తించి, వాటిని చక్కదిద్దేందుకు ప్రణాళిక రూపొందించి భద్రతను పెంచాలని సూచించారు.