Devotional

గంగ ప్రారంభ క్షేత్రం-ఋషికేష్

these are the best places to visit in rishikesh the hindu pilgrimage in north india

హిమగిరుల పాదాల చెంత ఉన్న అద్భుతం… స్వచ్ఛమైన గంగను కళ్లముందుంచే క్షేత్రం… రుషీకేశ్‌. ఈ పుణ్యతీర్థం భక్తులను మాత్రమే కాదు.. సాహసవంతులనూ ఆహ్వానిస్తోంది. గోరంత తెగువ చూపితే.. కొండంత ఆనందాన్ని ఇస్తానంటోంది. చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాలకు దారిచూపే ఈ దివ్యధామం.. సాహసద్వారంగా ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది.

*** ఉత్తరాఖండ్‌లోని రుషీకేశ్‌ పుణ్యక్షేత్రమనే అందరికీ తెలుసు. అలాగని ఇది జ్యోతిర్లింగ క్షేత్రమూ కాదు.. శక్తిపీఠమూ కాదు. చార్‌ధామ్‌ యాత్రకు ముందు గడప ఇది. అందుకే ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఎందరో యోగులు రుషీకేశ్‌లో సాధన చేస్తుంటారు. మంచు కొండలను వీడిన గంగమ్మ.. తేటనీటితో పాలవెల్లిలా పారుతుందిక్కడ. రుషీకేశ్‌ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వాతావరణానికే కాదు.. అచ్చమైన సాహస క్రీడలకూ కేరాఫ్‌ అడ్రస్‌. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చిపోయే భక్తులు ఒకవైపు.. సాహసం శ్వాసగా భావించే పర్యాటకులు మరోవైపు. గంగలో పుణ్యస్నానాలు ఆచరించే వారు కొందరు.. అదే గంగలో రాఫ్టింగ్‌ చేస్తూ రఫ్ఫాడించేవాళ్లు ఇంకొందరు. భాగవత పారాయణాలతో తరించేవారు తారసపడతారు.. బంగీజంపులతో లోకాన్ని మైమరిచేవారు కంటపడతారు. అందరి ఆదరణ పొందిన అరుదైన పర్యాటక కేంద్రమిది. జలక్రీడలు, కొండల్లో విహారాలు.. ఉత్సాహవంతులైన పర్యాటకులకు సిసలైన వినోదాన్ని పంచుతాయి.

*** పౌరాణిక కాలం నుంచి రుషీకేశ్‌ ప్రస్తావన కనిపిస్తుంది. రావణ సంహారం తర్వాత రామలక్ష్మణులు ఈ క్షేత్రంలో కొన్నాళ్లు తపస్సు చేశారట. వాళ్లు గంగపై నారలతో రెండు వంతెనలు నిర్మించారని చెబుతారు. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే ఇనుప వంతెనలు దర్శనమిస్తాయి. వీటిని రామ్‌ఝూలా, లక్ష్మణ్‌ఝూలా అని పిలుస్తుంటారు. వశిష్ఠుడు తపస్సు చేసినదిగా చెప్పే వశిష్ఠ గుహ, రఘునాథస్వామి ఆలయం, లక్ష్మణస్వామి గుడి, రుషికుండ్‌, గీతాభవన్‌, త్రివేణి ఘాట్‌ తదితర ప్రాంతాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. యోగా క్యాపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌గా పేరొందిన నగరంలో యోగా సెంటర్లు కోకొల్లలు. వివిధ ఆశ్రమాల్లో యోగా తరగతులు ఏడాదంతా జరుగుతుంటాయి. దేశవిదేశాల నుంచి వచ్చే ఔత్సాహికులు నెలల తరబడి ఇక్కడే ఉంటూ యోగాభ్యాసం చేస్తుంటారు. గంగ ఒడ్డున ఉండే విశాలమైన ఆశ్రమాలు సాధకులకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇక్కడికి సమీపంలోని రాజాజీ నేషనల్‌ పార్క్‌ జంతుప్రేమికులను అలరిస్తుంది.

*** చేరుకునేదిలా..రుషీకేశ్‌కు సమీపంలో డెహ్రాడూన్‌ విమానాశ్రయం ఉంది. కానీ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి డెహ్రాడూన్‌కు నేరుగా విమాన సర్వీసులు లేవు. ముందుగా దిల్లీకి వెళ్లి అక్కడి నుంచి రుషీకేశ్‌ (245 కి.మీ.) బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. దిల్లీ నుంచి హరిద్వార్‌ జంక్షన్‌కు రైళ్లు ఎక్కువ. హరిద్వార్‌ నుంచి రోడ్డు మార్గంలో రుషీకేశ్‌ (20 కి.మీ.) వెళ్లొచ్చు. దిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రుషీకేశ్‌ (45 కి.మీ) చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్‌ నుంచి హరిద్వార్‌కు బైవీక్లీ రైలు అందుబాటులో ఉంది.

**గంగ ఒడ్డున కొండ వాలులోనో.. గంగానది ఒడ్డునో.. గుడారాలు వేసి క్యాంప్‌ నిర్వహిస్తారు. ఆటలు, పాటలు ఉంటాయి. పసందైన భోజనం వడ్డిస్తారు. రాత్రి వేళలో.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ.. గుడారాల్లో విశ్రమిస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ క్యాంప్‌లో రెండు, మూడు రోజుల ప్యాకేజీలు కూడా ఉంటాయి. క్యాంప్‌ పరిసరాల్లోనే సాహస క్రీడలన్నీ అందుబాటులో ఉంటాయి. ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ అవకాశం కూడా ఉంటుంది. ఎంచుకునే ప్యాకేజీని బట్టి రూ.3,000 మొదలు రూ.12,000 వరకూ వీటి ధరలు (ఒక్కొక్కరికి) ఉంటాయి.

*** కోరుకున్నన్ని ఆటలు..ఔత్సాహికులకు రుషీకేశ్‌లో క్షణం తీరికుండదు. కోరుకున్న వారికి కావాల్సినన్ని ఆటలున్నాయి. నదిలో సయ్యాటలాడే క్రీడలు కొన్నయితే, గాలిలో తేలిపోయే ఆటలు ఇంకొన్ని. బోటింగ్‌, రివర్‌ రాఫ్టింగ్‌, బంగీజంప్‌, ఫ్లయింగ్‌పాక్స్‌, ఎయిర్‌ బెలూన్‌ విహారం ఇలా ఎన్నో అలరిస్తాయి.

*** బోటులో దీటుగా…ఉరుకుల పరుగుల గంగలో రాఫ్టింగ్‌ భలేగా ఉంటుంది. వంకల్లో, డొంకల్లో బోటును అదుపు చేస్తూ ముందుకు సాగుతుంటే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. బోటులో నిపుణుడైన కెప్టెన్‌ తోడుంటాడు కాబట్టి ఆందోళన అవసరం లేదు. రాఫ్టింగ్‌ సమయంలో సేఫ్టీ జాకెట్‌ ధరించడం తప్పనిసరి. టికెట్‌ ధర రూ. 1,200-రూ.5,000 (గంట నుంచి మూడు గంటల వరకు షికారు చేయొచ్చు)

*** జస్ట్‌ జంప్‌…రుషీకేశ్‌లో బంగీ జంప్‌ పర్యాటకులకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. 83 మీటర్ల ఎత్తు నుంచి అమాంతంగా దూకాలి. కింద లోయలో గంగానది వేగంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. అంతలోనే మళ్లీ గాల్లోకి లేస్తాం. ఉత్సాహం రెండింతలు అవుతుంది. ఎంత అందంగా దూకుతామో.. అంతే హుందాగా పైకి లేచామా.. ‘భళా!’ అని ప్రశంసా పత్రం అందజేస్తారు. బంగీ జంప్‌ చేయగలనన్న నమ్మకం, ధైర్యం ఉన్నవారు మాత్రమే దూకడానికి సాహసించాలి. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులను మాత్రమే అనుమతిస్తారు.టికెట్‌ ధర: రూ.3,500

*** విహంగ వీక్షణం…హాట్‌ ఎయిర్‌లో గగనాకికేగితే రుషీకేశ్‌ అసలు సౌందర్యం కంటపడుతుంది. బెలూన్‌లో సుమారు 200 నుంచి 500 అడుగుల ఎత్తు వరకూ తీసుకెళ్తారు. టికెట్‌ ధర: రూ.2,500-రూ.4,500

*** తాడు తోడుగా.. లోయ మీదుగా – పైన ఒక తాడే ఆధారం. సూపర్‌మాన్‌లా పడుకుని ప్రయాణించాలి. ఒక కొండ నుంచి మరో కొండకు లోయ మీదుగా కిలోమీటర్‌ దూరం దూసుకుపోవాలి. దీనినే ఫ్లయింగ్‌ ఫాక్స్‌ అంటారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే ముందడుగు వేయాలి. టికెట్‌ ధర: రూ.1,750- రూ.3,000

*** రెక్కలు తొడిగి.. నింగికి ఎగిరి..రుషీకేశ్‌లోని రాజాజీ నేషనల్‌ పార్క్‌లో ఎయిర్‌ సఫారీ అందుబాటులో ఉంది. ఓపెన్‌ ఎయిర్‌ మోటర్‌ క్రాఫ్ట్‌ పారాచూట్‌ సహాయంతో నింగికెగిరి.. హిమాలయాల సోయగాలు చూసి రావొచ్చు. లోయల్లో ఉరకలేస్తున్న గంగానదిని చూడొచ్చు. పైలట్‌ తోడుగా ఉంటాడు. టికెట్‌ ధర: రూ.4,400- రూ.8,500 (పది నిమిషాల నుంచి గంట వరకు)

*** పక్కనే మరో అద్భుతం – రుషీకేశ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పుణ్యక్షేత్రం హరిద్వార్‌. సప్తపూరీల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ క్షేత్రంలో పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళ జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక, పారిశ్రామిక నగరిగా పేరొందిన ఈ పట్టణంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. సప్తరుషి ఆశ్రమం, మానసాదేవి ఆలయం, భారతమాత మందిరం, బ్రహ్మకుండ్‌ తదితర హరిద్వార్‌ ఆధ్యాత్మికతను చాటిచెబుతుంటాయి. మానసాదేవి మందిరానికి కేబుల్‌ కారు సౌకర్యం ఉంది.