Ø స్టెర్లింగ్ ఎస్‌ఈజడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇచ్చిన రుణ వివాద పరిష్కారం విషయంలో ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని రుణదాతల బృందానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థపై దివాలా పిటిషన్ ఉపసంహరించుకోవాలనుకున్న రుణదాతల విజ్ఞప్తిని తిరస్కరించడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారంలో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ బ్యాంకుల్లోని సంబంధిత అధికార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్టెర్లింగ్ ఎస్‌ఈజడ్‌ను తెగనమ్మక (లిక్విడేషన్) తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఈ సంస్థకు రూ.8,100 కోట్ల మేరకు అప్పులు ఇచ్చిన బ్యాంకులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని స్పష్టమవుతోంది.
Ø అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలు ఆర్జించాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెప్పించడంతో సెన్సెక్స్ మళ్లీ 39000 పాయింట్ల ఎగువకు చేరింది
Ø ప్రైవేటు రంగ యెస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1506.64 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2017-18 ఇదే త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ ప్రాతిపదికన రూ.1179.44 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Ø ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.470 కోట్ల పన్ను ముందు లాభాన్ని (పీబీటీ) ఆర్జించింది. 2017-18 ఇదే కాలంలో సంస్థ ఆర్జించిన రూ.422 కోట్ల పీబీటీతో పోలిస్తే ఇది 11 శాతం అధికం.
Ø యాక్సిస్ బ్యాంక్ సీఈఓ అమితాబ్ ఛౌధ్రీ, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జరీన్ దారువాలా, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాజీ అధిపతి రమేశ్ చంద్రా బావాలకు ఎన్‌సీఎల్‌టీ ధిక్కార నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి రమేశ్‌చంద్రాకు నగదు ఉపసంహరణకు వీలు కల్పంచడంతో పాటు లాకర్ల సౌకర్యం కల్పించారని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆరోపించడంతో ఎన్‌సీఎల్‌టీ ఈ నోటీసులు ఇచ్చింది.
Ø బ్యాంకులపై చేసిన వార్షిక తనిఖీ నివేదిక వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద బయటకు వెల్లడించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘చట్టం కింద మినహాయింపు పొందిన వివరాలు మినహా మిగతా అన్నిటినీ వెల్లడించాలి. అది మీ బాధ్యత’ అని న్యాయమూర్తి, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.
Ø పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.456.24 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2017-18 ఇదే కాలంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.3,943.98 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం తక్కువ.
Ø జనవరి- మార్చిలో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాండలోన్ ప్రాతిపదికన రూ.364.01 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన రూ.346.84 కోట్ల నికర లాభం కంటే ఇది 5 శాతం అధికం.
Ø దేశంలో మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు 4% పెరిగి 3.1 కోట్లకు చేరాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
Ø బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్ దాఖలు చేసిన రూ.4,350 కోట్ల సవరించిన బిడ్‌పై ఈ నెల 30న రుచి సోయా రుణ దాతలు నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రుచి సోయాను కొనుగోలు చేయడం కోసం గత నెలలో పతంజలి తన బిడ్‌ను రూ.200 కోట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే.
Ø నాలుగు హోటళ్లు, హోటళ్ల కార్యకలాపాలు, లీలా ప్యాలెసెస్ అండ్ రిసార్ట్స్‌లో షేర్లను విక్రయించడానికి వాటాదార్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అంగీకరించారని హోటల్ లీలావెంచర్ వెల్లడించింది. అయితే సెబీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది.
Ø నియోజెన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకు చివరి రోజు నాటికి 41.14 రెట్ల స్పందన లభించింది. రూ.132 కోట్ల ఈ ఐపీఓకు 43,29,038 షేర్ల కోసం బిడ్లు ఆహ్వానించగా.. 17,80,95,125 షేర్లకు బిడ్‌లు దాఖలు కావడం విశేషం. రిటైల్ మదుపర్ల నుంచి 15.67 రెట్ల స్పందన వచ్చింది.
Ø మేక్‌మైట్రిప్‌లో తనకు మొత్తం వాటాను చైనాకు చెందిన సిట్రిప్.కామ్ ఇంటర్నేషనల్‌కు విక్రయించడం ద్వారా ఈ కంపెనీ నుంచి దక్షిణాఫ్రికా కంపెనీ నాస్పర్స్ నిష్క్రమించింది. ఈ వాటా విక్రయం వల్ల సిట్రిప్.కామ్ ఇంటర్నేషనల్‌లో నాస్పర్‌కు 5.6 శాతం వాటా దక్కుతుంది. ఈ లావాదేవీతో మేక్‌మైట్రిప్‌లో సిట్రిప్.కామ్ వాటా 49 శాతానికి చేరుతుంది.
Ø వ్యాపార వృద్ధి కోసం యాక్సిస్ బ్యాంక్ రూ.35,000 కోట్లను సమీకరించనుంది. జులై 20న జరిగే వార్షిక సాధారణ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. డెట్‌సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా విదేశీ, దేశీయ కరెన్సీలో బ్యాంకు ఈ నిధులను సమీకరించనుంది.
Ø ఇటాలియన్ రేసింగ్, స్పోర్ట్స్, విలాసవంత బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ సరికొత్త స్క్రాంబ్లర్ శ్రేణి స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నెలకొల్పిన డుకాటీ విక్రయశాలలో డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ (రూ.7.89 లక్షలు), డెసర్ట్ స్లెడ్ (రూ.9.93 లక్షలు), ఫుల్ థ్రోటెల్ (రూ.8.92 లక్షలు), కేఫ్ రేసర్ (రూ.9.78 లక్షలు)ను ఆవిష్కరించారు
Ø ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65% వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
Ø కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో పొదుపు ఖాతాల్లో రూ.1 లక్ష వరకు ఉండే నగదు నిల్వలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.5%) తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లు 4.5 శాతానికి పరిమితమయ్యాయి.
Ø ఐజీఎస్‌టీ రూపేణా పొందిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను (ఐటీసీ) కేంద్ర (సీజీఎస్‌టీ), రాష్ట్ర జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) చెల్లింపులకు సర్దుబాటు చేసేందుకు రెవెన్యూ విభాగం అనుమతినిచ్చింది.
Ø దేశీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని నిషేధించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగమైన ‘ద ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’(ఐఈపీఎఫ్) పిలుపునిచ్చింది.
Ø హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రశ్రేణి ఔషధ సంస్థ అరబిందో ఫార్మా షేర్‌కు గత 3 రోజులుగా స్టాక్‌మార్కెట్లో ఎంతో ఆకర్షణ కనిపించింది. శుక్రవారం ఒక్క రోజే ఈ షేర్ బీఎస్‌ఈలో 5 శాతం వరకు పెరిగి 52 వారాల గరిష్ఠ ధర (రూ.836.95) నమోదు చేసింది.
Ø జనవరి- మార్చి త్రైమాసికానికి హీరో మోటోకార్ప్ నికర లాభం 24.5 శాతం క్షీణించి రూ.730.32 కోట్లకు పరిమితమైంది. 2017-18 ఇదే కాలంలో ఈ ద్విచక్రవాహనాల తయారీ దిగ్గజం రూ.967.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.