NRI-NRT

అమెరికాలో ఎన్నికల సర్వే జరుపుతున్న రాజగోపాల్

lagadapati rajagopal touring usa for surveys on 2019 election results in andhra

మాజీ ఎంపీ, రాజకీయ ఎన్నికల విశ్లేషకుడు లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజుల నుండి కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ఏంజిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, శాన్‌హోసేలలో పర్యటిస్తూ స్థానిక ప్రవాస తెలుగువారిని కలుసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలామంది ప్రవాస తెలుగువారు వేలసంఖ్యలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొన్నవారిని కూడా కలుసుకుని రాజగోపాల్ వివరాలు సేకరిస్తున్నారు. వచ్చే మే 19వ తేదీన గెలుపొందే పార్టీలపైన తన అభిప్రాయాలు వెల్లడిస్తానని రాజగోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తన సర్వే ఎందుకు లెక్క తప్పిందో కూడా ఆరోజే చెబుతానని స్పష్టం చేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారని అన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్నారై తెదేపా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం జరిగింది. ఉత్తర అమెరికాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరామ్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా లగడపాటి సహా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ హాజరయ్యారు. ఏపీలో తెదేపా 130 సీట్లకుపైగా గెలుస్తుందని, చంద్రబాబు మళ్లీ సీఎం అవడం ఖాయమని ప్రసాద్‌ అన్నారు. తెదేపా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధిలో గుజరాత్‌ను మించిపోతున్నామనే అసూయతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని లగడపాటి ధ్వజమెత్తారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే చంద్రబాబును గెలిపిస్తాయని కార్యక్రమానికి నాయకత్వం వహించిన కోమటి జయరాం అన్నారు. ఈ కార్యక్రమంలో కోగంటి వెంకట్, కాకర్ల రజనీకాంత్, సుబ్బా యంత్ర, ఎన్నారై తెదేపా సభ్యులు పాల్గొన్నారు.