బ్రిటిష్ నటుడు మైఖేల్ కోర్సలేతో కొన్నేళ్లుగా శ్రుతి హాసన్ సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన్ని తన కుటుంబంలో జరిగిన కొన్ని వేడుకలకి కూడా ఆహ్వానించి కుటుంబ సభ్యులకి పరిచయం చేసిందామె. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగింది. అయితే శ్రుతి మాత్రం ఆ విషయం గురించి ఎప్పుడు అడిగినా… దాటవేస్తూ వచ్చింది. ‘‘సినిమా కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని కాబట్టి… బాల్యం మొదలుకొని ఇప్పటివరకు నా జీవితంలో జరిగిన అన్ని విషయాల గురించి అందరికీ తెలుసు. కనీసం కొన్ని వ్యక్తిగత విషయాలైనా రహస్యంగా ఉండాలి కదా’’ అంటూ అసలు ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే ఆమె తప్పించుకొనేది. మైఖేల్‌తో ఉన్న బంధం ఏంటనేది మాత్రం శ్రుతి ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఇటీవల ఇద్దరూ విడిపోయారని ప్రచారం మొదలైంది. తాజాగా ఆ విషయాన్ని మైఖేల్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. ‘దురదృష్టవశాత్తూ జీవితం మమ్మల్ని వ్యతిరేక మార్గాల్లో నిలిపింది. కాబట్టి మేం ఇక మీదట ఒంటరి మార్గాల్లోనే నడవాలి. కానీ శ్రుతి ఎప్పుడూ నా ఉత్తమ సహచరి. ఆమెకి ఒక స్నేహితుడిగా ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటా. లవ్ యూ’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు మైఖేల్. దీన్నిబట్టి ఈ ఇద్దరూ ప్రేమబంధం నుంచి బయటికొచ్చారనే విషయం స్పష్టమవుతోంది. ఏడాదిన్నర విరామం తర్వాత ఇటీవలే శ్రుతి మళ్లీ సినిమా ప్రయాణం మొదలు పెట్టింది. తమిళంలో ఓ చిత్రం కోసం కెమెరా ముందుకొచ్చింది. త్వరలోనే తెలుగులోనూ ఆమె నటించబోతోందని సమాచారం.
శుభం కార్డు పడింది
Related tags :