Movies

నృత్యానికి గుడ్‌బై

hrithik says he can no longer dance

‘నేను డ్యాన్స్‌ చేయలేనని వైద్యులు చెప్పిన సందర్భం కూడా ఉంది’ అని బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ అన్నారు. 2000లో ‘క్రిష్‌’ నటుడిగా అరంగేట్రం చేసినప్పుడు అందరూ ఆయన్ను బాలీవుడ్‌లో తర్వాతి సూపర్‌స్టార్‌ అనుకున్నారు. లుక్స్‌, నటనపరంగానే కాకుండా ఆయన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. అలా హృతిక్‌ బాలీవుడ్‌లోనే ఉత్తమ డ్యాన్సర్‌గా ఎదిగారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా సందర్భంగా సోమవారం ఓ ఆంగ్లపత్రిక హృతిక్‌ను పలకరించింది. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు హృతిక్‌ సమాధానం చెప్పారు. ‘పాఠశాల నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి ఉంది. వార్షికోత్సవంలో అందరం డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొనేవాళ్లం. పుట్టినరోజు పార్టీలలో బాలీవుడ్‌ పాటలకు డ్యాన్సులు చేసేవాళ్లం. ఒక్కొక్కరు ఒక్కో పాటకు తమదైన శైలిలో స్టెప్పులేసేవారు. నా తొలి సినిమా ‘కహోనా ప్యార్‌ హై’కు సిద్ధమౌతున్నప్పుడు ఎక్కువగా మోకాలితో డ్యాన్స్‌ చేయడంపై దృష్టిపెట్టా. మైఖెల్‌ జాక్సన్‌, షమ్మీ కపూర్‌, గోవిందకు నేను వీరాభిమానిని. వీరి డ్యాన్సింగ్‌ స్టైల్‌ విభిన్నంగా ఉంటుంది. అద్దం ముందు నిల్చుని వారి స్టైల్‌ను ఇమిటేట్‌ చేస్తూ పెరిగా. లెజెండరీ మైఖెల్‌ జాక్సన్‌తో కలిసి వేదిక పంచుకోవాలనేది నా ఆశ. కానీ అది తీరలేదు. చిన్నతనం నుంచి ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను డ్యాన్స్‌ నేర్చుకోవడానికి ప్రధాన కారణం కూడా ఆయనే. ఫిట్‌గా ఉండటానికి డ్యాన్స్‌ ఎంతో తోడ్పడుతుంది. నువ్వు ఇంకెప్పుడూ డ్యాన్స్‌ చేయలేవు అని వైద్యులు నాతో అన్న రోజు కూడా ఉంది. అలాంటి సమయంలోనూ నేను డ్యాన్స్‌ చేశా (నవ్వుతూ). ఫిట్‌గా ఉండేందుకు డ్యాన్స్‌ ఎంతో గొప్ప మార్గం. కేలొరీలు కరిగించేందుకు, కండరాల్ని బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మా అమ్మ, పిల్లల్ని కూడా డ్యాన్స్‌ చేయమని ప్రోత్సహిస్తుంటా. వారికీ అది నచ్చింది. నాకు ఇష్టమైన పాటల్ని ఎంచుకోవడం కాస్త కష్టమైన పనే. కానీ దేవా శ్రీ గణేశ్‌ (‘అగ్నిపథ్‌‌’), ధూమ్‌ ఎగైన్‌ (‘ధూమ్‌ 2’), బ్యాంగ్‌ బ్యాంగ్‌ (‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’).. పాటలంటే ఎక్కువ ఇష్టం. డ్యాన్స్‌ రియాల్టీ షోల వల్ల కొత్త టాలెంట్‌ను ప్రమోట్‌ చేయొచ్చు. కొత్త వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఈ షోలు కల్పిస్తున్నాయి. గతంలో నేను ఓ డ్యాన్స్‌ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించా. భవిష్యత్తులో మళ్లీ ఆ అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా’. అని హృతిక్‌ అన్నారు.