Politics

భారతదేశం వలన మనం చాలా పొగొట్టుకున్నాం

trump says america lost a lot due to india

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అధిక పన్నులు వేయడాన్ని విమర్శించారు. ఆ దేశ కాగిత ఉత్పత్తులు సహా, హార్లీ డేవిడ్‌సన్‌ వంటి బైక్‌లపై భారత్‌, చైనా, జపాన్‌లాంటి దేశాలు అధిక పన్నులు వేయడం వల్ల అమెరికాకు లక్షల డాలర్లు నష్టం వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్కాన్‌సిన్‌ స్టేట్‌లోని గ్రీన్‌బే సిటీలో జరిగిన రిపబ్లికన్‌ పొలిటికల్‌ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పదేపదే భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పన్నులు విధించడంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటోందని, వాళ్లు వేసే పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆరోపించారు. ‘భారత్, చైనా, జపాన్‌ దేశాల వల్ల దశాబ్దాలుగా మనం లక్షల డాలర్లను కోల్పోతున్నాం. దేశమేదైతేనేమి, చివరకు నష్టపోవాల్సి వస్తోంది మనమే. ఇప్పటివరకూ పొగొట్టుకున్నది చాలు. ఇక మీదట అలా జరగకుండా జాగ్రత్తపడదాం’ అని అన్నారు. ‘విదేశాల కాగిత ఉత్పత్తులపై అమెరికా పన్నులేమీ విధించడం లేదు. కానీ, విస్కాన్‌సిన్‌ పేపర్‌ కంపెనీ ఎగుమతులపై చైనా, భారత్‌, వియత్నాంలు భారీగా పన్నులు వేస్తున్నాయి. దీంతో మనమూ పన్నులు విధించకతప్పదు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.’ అని అన్నారు. కాగా ఈ ఏడాది భారత్‌-అమెరికాల పరస్పర అవగాహన కారణంగా హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌లపై ఉన్న దిగుమతి సుంకాన్ని 100శాతం నుంచి 50శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రంప్‌ అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హార్లీ డేవిడ్‌సన్‌ బైకులనే తీసుకోండి. మూడేళ్ల కిందట ఆ సంస్థ వారిని నేను కలిశా. పన్నుల వల్ల వ్యాపారం చాలా కష్టంగా ఉందని చెప్పారు. భారత్‌లో ఎలా వ్యాపారం చేస్తున్నారని నేను అడిగా. అస్సలు లాభసాటిగా లేదని చెప్పారు. ఎందుకంటే భారత్‌ ఆ బైక్‌లపై 100శాతం పన్నును విధిస్తోంది. అయితే, వారి మోటర్‌ సైకిళ్లను మన దేశానికి పంపితే, మనం మాత్రం ఎలాంటి పన్నులు విధించడం లేదు. అప్పుడే ఈ విషయంపై ఆ దేశ ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడా. 100శాతం పన్ను వేయడం దారుణమని చెప్పా. దాంతో ఆయన దానిని 50శాతానికి తగ్గించారు. అయితే, అదేమీ అంత మంచి నిర్ణయం మాత్రం కాదు. 50శాతం తగ్గించడం వల్ల మనకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం మార్చాలి.’’ అని ట్రంప్‌ అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు 47.9బిలియన్‌ డాలర్లు ఉండగా, దిగుమతులు 26.7బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.