Ø పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో అమెరికా, యూరప్ వెళ్లేందుకు భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు ప్రయాణించే దూరం ఎక్కువగా ఉండటంతో పాటు సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో రోజుకు రూ. 6కోట్లు చొప్పున ఎయిరిండియా రూ. 300కోట్లకు పైగా నష్టపోయినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిరిండియా పౌర విమానయాన శాఖను ఆశ్రయించి నష్టపరిహారం కోరినట్లు తెలుస్తోంది.
Ø ఆస్ట్రేలియా బ్రోకరేజీ సంస్థ మెక్వారీ యెస్ బ్యాంక్ రేటింగ్‌ను రెండు అంచెలు కిందకు సవరించింది. అంతే కాదు..ఆ బ్యాంకు చేపట్టిన రుణాల పునర్ వ్యవస్థీకరణ వ్యాపారంలోని నష్టభయాలను ముందుగా కనిపెట్టలేకపోయినందుకు క్షమాపణలు సైతం తెలిపింది. మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంకు రూ.1506 కోట్ల నష్టం ప్రకటించిన విషయం విదితమే. కాగా, ఇది బ్యాంకుకు తొలి నికర నష్టం కావడం గమనార్హం. మొండి బకాయిలను తక్కువ చేసి చూపడంతో పాటు అధ్వాన పాలనా ప్రమాణాలను పాటించినందుకు రాణా కపూర్‌ను ఈ బ్యాంకు నుంచి ఆర్‌బీఐ ఈ ఏడాది మొదట్లో ఉద్వాసనకు గురి చేసిన సంగతి తెలిసిందే.
Ø భారతీయ బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా తాజాగా మరోమారు ట్విటర్ వేదికగా స్పందించారు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన బకాయిల్ని 100 శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Ø ముంబయిలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న (సోమవారం) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లు పనిచేయలేదు.
Ø గత ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో మురుగప్ప గ్రూప్ కంపెనీ శాంతి గేర్స్ రూ.6.01 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
Ø సాగర్‌సాఫ్ట్ (ఇండియా) 2018-19 నాలుగో త్రైమాసికంలో రూ.10.58 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.1.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.3.05 ఉంది. ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఆదాయం రూ.41.84 కోట్లు, నికరలాభం రూ.6.23 కోట్లు, ఈపీఎస్ రూ.11.53 ఉన్నాయి. వాటాదార్లకు 15 శాతం (ఒక్కో షేర్‌కు రూ.1.50 చొప్పున) తుది డివిడెండ్ చెల్లించాలని సోమవారం బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది జనవరిలో 10 శాతం మధ్యంతర డివిడెండ్ చెల్లించిన విషయం విదితమే
Ø గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.151.08 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.112.61 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 34.16 శాతం అధికం.
Ø మార్చితో ముగిసిన త్రైమాసికంలో క్యాస్ట్రాల్ ఇండియా రూ.185 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.181.8 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 2 శాతం అధికం.
Ø మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.72.38 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.113.51 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
Ø కాంపాక్ట్ విభాగంలోని న్యూ వ్యాగన్‌ఆర్, ఇగ్నిస్, సెలెరియో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ మోడళ్లకు చెందిన 8,71,864 కార్లను 2018-19లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) విక్రయించింది. 2017-18లో విక్రయించిన 7,48,475 కార్లతో పోలిస్తే ఇది 16.5 శాతం ఎక్కువ.
Ø తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ భవితపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఉద్యోగులే ఆ సంస్థను కొనేందుకు ముందుకు వచ్చారు. ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. రూ.7,000 కోట్ల వరకు తీసుకొస్తామని పైలట్లు, ఇంజినీర్లకు ప్రాతినిథ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు ద సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (స్విప్), ద జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింట్‌నెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (జేఏఎంఈవీఏ)లు ఆయనకు ఓ లేఖ రాశాయి.
Ø లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌లో వ్యాపార ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, బాలీవుడ్ నటులు, క్రీడా దిగ్గజాలు ముంబయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ఆర్థిక రాజధానిలో పోలింగ్ ప్రారంభం నుంచే పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు ఓటు వేయడానికి తరలివచ్చారు.
Ø దేశీయ సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీపై మరో కేసు దాఖలైంది. ఐదేళ్ల వ్యవధిలో వ్యాపార రహస్యాలను దొంగిలించిందనే అభియోగంపై దాఖలైన రెండో కేసు ఇది. అమెరికాకు చెందిన కంప్యూటర్ సర్వీస్ కార్ప్ ఈ ఆరోపణలు చేసింది. బీమా రంగానికి చెందిన సేవలు అందించే సాఫ్ట్‌వేర్ తయారీ కోసం అవాఛనీయ విధానంలో సోర్స్‌కోడ్‌ను దొంగిలించిందని పేర్కొంది.
Ø దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగా కారును విడుదల చేసింది. దీనిలో కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీడీఐఎస్ 225 డీజిల్ ఇంజిన్‌ను అమర్చింది. ఈ కారును వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తోంది. వీటి ప్రారంభ ధర దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో రూ.9.86లక్షలు కాగా అత్యధిక ధర రూ.11.20 లక్షలు.