Videos

ఐఐటీ హైదరాబాద్ సత్తాకు నిదర్శనం-విద్యుత్ బైక్

ebike from hyderabad iit goes 120km on a single charge for dead cheap price

చేసే ప్రయాణం పర్యావరణ హితంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లగలగాలి. సాంకేతికంగా ఎలాంటి సమస్యలూ ఉండకూడదు. సరిగ్గా ఇవే లక్ష్యాలతో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘ప్యూర్‌ ఈవీ’ విద్యుత్‌ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. నగర శివారులోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇప్పటికే 18,000 చదరపు అడుగుల్లో పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. నెలరోజుల్లో దేశవ్యాప్తంగా విక్రయించేలా వాహనాలను సిద్ధం చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 వాహనాలను విపణిలోకి తేవాలన్నదే లక్ష్యం. ఐఐటీ హైదరాబాద్‌ ఆచార్యులు నిశాంత్‌, ఐఐటీ ముంబయికి చెందిన రోహిత్‌ 2016లోనే అంకుర సంస్థకు నాంది పలికారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి, బ్యాటరీలదే కీలక పాత్ర. దీనిపైనే ప్రధానంగా దృష్టి సారించిన ప్యూర్‌ ఈవీ.. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి పనిచేస్తోంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా పనిచేసే లిథియం అయాన్‌ బ్యాటరీలను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు నిశాంత్‌ తెలిపారు. నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతాయని, ఒక్కసారి చేస్తే 120 కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కిలోమీటరు ప్రయాణానికి అయిదు పైసలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఎవరైనా సులభంగా ప్రయాణం సాగించేలా 45 కిలోల బరువున్న ‘ఈ-ట్రాన్స్‌’ మోడల్‌ స్కూటర్‌ను అభివృద్ధి చేసినట్లు నిశాంత్‌ వెల్లడించారు. వాహనాలకు రూ.30,000 నుంచి రూ.70,000 మధ్య ధర నిర్ణయించామన్నారు.