WorldWonders

అవి “యతి” పాదముద్రికలే-భారత సైన్యం

Yati In Himalayas Seen By Indian Army

యతి.. భారీ శరీరంతో భయంకరంగా కన్పించే ఈ మంచు మనిషి గురించి పురాణాలు, పాత సినిమాల్లో అప్పుడప్పుడు వింటుంటాం. ఇది ఓ కల్పిత పాత్ర మాత్రమేనని చెబుతున్నా.. నిజంగా భూమిపై యతి మంచుమనిషి ఉన్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తాయి. తాజాగా భారత ఆర్మీ కూడా యతి అస్థిత్వంపై ఆసక్తికర ట్వీట్‌ చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను భారత సైన్యం గుర్తించింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ ట్విటర్‌లో పేర్కొంది. గతంలోనూ మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విటర్‌లో పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోల్లో కేవలం ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండటం గమనార్హం. యతి.. అనేది ఇప్పటివరకు పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే ఓ కల్పిత పాత్ర మాత్రమే. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ మంచు మనిషి సంచారం ఉన్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. మంచుపై కన్పించిన పాద ముద్రల ఆధారంగానే అప్పుడు కూడా కథనాలు రాశారు.

‘యతి’. మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. ఏకంగా భారత ఆర్మీనే హిమాలయాల్లో ఇవిగో యతి అడుగు జాడలు అంటూ కొన్ని ఫొటోలను ప్రజలతో పంచుకుంది. దీంతో ‘యతి’ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ పురాణాలు, ఇతిహాసాల్లో మాత్రమే యతి గురించి విన్నాం. గతంలోనూ ఇలాంటి అనేక వార్తలు వచ్చాయి. దీనిపై భిన్నవాదనలూ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం! భారత పురాణాల ప్రకారం ఈ ప్రపంచంలో చిరంజీవులుగా పేర్కొన్న కొందరిలో హనుమంతుడు ఒకడు. ఇప్పటికీ ఆయన హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నారని హిందూ భక్తుల విశ్వాసం. యతి పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఆంజనేయస్వామి అక్కడ తిరుగుతున్నారని భక్తులు నమ్ముతారు. అయితే, అందుకు ఆ కాలి జాడలు తప్ప మరో ఆధారం లేదు. ఇంకొందరు ఆ యతిని చూశామని ఎలుగుబంటి రూపంలో యతి సంచరిస్తున్నాడని, ఆయనే జాంబవంతుడని అంటారు. కానీ, ఎవరూ ఆ యతిని కలిసింది లేదు. ఇదంతా భక్తి, విశ్వాసాలకు సంబంధించిన అంశం.