Business

దుబయిలో మహీంద్ర లగ్జరీ విద్యుత్ కారు బటీస్టా ఆవిష్కరణ

Mahindras Luxury Car Division Automobili Pininfarina Launches Battista Electric Car In Dubai

మహీంద్ర సంస్థకు చెందిన ఇటలీ కార్ల తయారీ సంస్థ ఆటోమొబైలి పినిన్ఫారిన మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్లోకి సరికొత్త హైపర్‌కార్‌ బట్టిస్టాను తీసుకొచ్చింది. దీని ధర 20లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ.13.95కోట్లు. ఇది పూర్తి ఇటాలియన్‌ డిజైన్‌తో తయారు చేసిన ఉద్గార రహిత ఎలక్ట్రిక్‌ కారు. దీనిని దుబాయ్‌లో విడుదల చేశారు. దుబాయ్‌లోని విలాసవంతమైన కార్ల డీలర్‌ ఆడమ్స్‌ మోటార్స్‌ షోరూమ్‌లో ఇది అందుబాటులో ఉంది. ఈ కారు పూర్తి ఉత్పత్తిని ఇటలీలోని కాంబియానో ఉత్పత్తి కేంద్రంలో 2020 ద్వితీయార్థంలో ప్రారంభిస్తారు. మొత్తం 150 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తారు. వీటిల్లో కనీసం 50 కార్లు మధ్యప్రాచ్యంలో విక్రయించాలని భావిస్తోంది. కంపెనీ డిజైన్‌ డైరెక్టర్‌ లూకా బోర్గోనో మాట్లాడుతూ ‘‘జెనీవా ఆటోషోలో దీనిని విడుదల చేసిన కొన్ని వారాల్లోనే దుబాయ్‌లో విడుదల చేయడం సంతోషంగా ఉంది. సూపర్‌ కార్లకు అత్యధిక డిమాండ్‌ ఉన్న దేశం ఇది. సరికొత్త బట్టిస్టా కారు 1,900 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీని నుంచి ఎటువంటి కాలుష్యం ఉత్పత్తికాదు. ఈ కారు అల్ట్రా హై పర్ఫార్మెన్స్‌ కార్లంటే ప్రేమను పెంచుతుంది.’’ అని అన్నారు. తొలుత ఆడమ్స్‌ మోటార్స్‌కు డీలర్‌ షిప్‌ ఇచ్చారు. సౌదీలో కూడా విక్రయించేలా మరో రిటైల్‌ భాగస్వామి కోసం కూడా అన్వేషన కొనసాగుతోందని పినిన్ఫారిన తెలిపింది.
కారు విశేషాలు ఇవీ..
* తొలిసారి 120 కెడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు
* నాలుగు చక్రాలకు నాలుగు మోటార్లు ఉంటాయి. మొత్తం కలిపి 1900 బీహెచ్‌పీ శక్తిని , 2,300 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తాయి.
* ప్రస్తుత ఫార్ములా1 కారుకన్నా ఇది చాలా వేగవంతమైంది.
* 0-100 కిలోమీటర్లను కేవలం రెండు సెక్లనలోపు అందుకుంటుంది. 12 సెకన్ల లోపు గంటకు 300 కిలోమీటర్ల వేగానికి చేరుతుంది. దీని అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. దీనిని గంటకు 450 కిలోమీటర్లకు కూడా చేర్చవచ్చ.