Sports

ధోనీ కేసును విచారించిన సుప్రీం

indian supreme court orders amrapali group to release payment details to dhoni

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలితో తలెత్తిన వివాదంతో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించకుండా ఆ సంస్థ తనను మోసం చేసిదంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ధోనీకి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలంటూ ఆమ్రపాలి సంస్థను ఆదేశించింది. ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారం లోగా కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. 2009-2016 మధ్య ఆమ్రపాలి సంస్థకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన సేవలను వాడుకుని తనకు డబ్బు చెల్లించలేదంటూ ధోనీ పిటిషన్‌లో పేర్కొన్నారు. అసలు, వడ్డీ కలిపి ఆమ్రపాలి గ్రూప్‌ తనకు ఇంకా రూ. 40కోట్ల బకాయిలు చెల్లించాలని తెలిపారు. అంతేగాక.. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ధోనీ ఒక పెంట్‌హౌజ్‌ బుక్‌ చేసుకున్నారు. దాని యాజమాన్య హక్కులను కూడా కల్పించకుండా కంపెనీ తనను మోసం చేసిందని ధోనీ పిటిషన్‌లో పేర్కొన్నారు. కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తమ నుంచి డబ్బు తీసుకుని ఇల్లు కట్టివ్వకుండా సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ 46వేల మంది కోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆమ్రపాలి డైరెక్టర్లు, బోర్డు సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. మధ్యలోనే ఆపేసిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ)ను సుప్రీం కోర్టు జనవరి 25న సూచించింది. ఫిబ్రవరి 28న ఆ సంస్థకు చెందిన సీఎండీ అనిల్‌ శర్మ, ఇద్దరు డైరెక్టర్లు శివ్‌ దీవాని, అజయ్‌ కుమార్‌ను పోలీస్‌ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.