యతి అడుగుజాడలంటూ భారత్ ఆర్మీ విడుదల చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీంతో అసలు ‘యతి’ అనే వింతజీవి ఉందా.. లేదా.. అన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు భిన్నంగా స్పందించారు. భారత ఆర్మీ ప్రకటించినందున దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ(బీఎన్హెచ్ఎస్) డైరెక్టర్ దీపక్ ఆప్టే అన్నారు. ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలాంటి వింత ఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. కానీ బలమైన శాస్త్రీయ ఆధారాలు లభించేవరకు వీటిని నిర్ధరించడం సరికాదన్నారు. అయితే వీటిపై మరింత పరిశోధన, చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉందని అభిప్రాయపడ్డారు. అంతరించిపోతున్న జంతువులపై బీఎన్హెచ్ఎస్ విస్తృత పరిశోధనలు జరుపుతోంది. అలాగే వానర జాతిపై విస్తృత పరిశోధనలు జరుపుతున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఆచార్యులు అనింద్య సిన్హా స్పందిస్తూ.. ఆర్మీ ప్రచురించిన ఫొటోల్లోని అడుగులు యతివి అనే వాదనతో తాను ఏకీభవించలేనన్నారు. హిమాలయాల్లో తిరుగాడే గోధుమ రంగు ఎలుగుబంట్ల పాదముద్రలు అయ్యుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అవి ఒక్కోసారి కేవలం వెనక పాదాలతో మాత్రమే నడుస్తాయని ఆ క్రమంలో అవి వదిలే అడుగుల గుర్తులు ‘యతి’ పాదముద్రలను తలపిస్తాయని వివరించారు. వీరితో పాటు పలువురు నిపుణులు సైతం ఆర్మీ వెలువరించిన ఫొటోల్లోని పాదముద్రలు యతివి కావని వాదిస్తుండడం గమనార్హం. ఒకే పాదంతో నడిచినట్లు అడుగులు ఉన్నాయని…..మరో పాదం అడుగులు ఏమైనట్లు అని ప్రశ్నిస్తున్నారు.
అవి యతివి కావు. గోధుమరంగు ఎలుగుబంటివి!
Related tags :