Politics

ప్రధానిని నిర్ణయించేది కేసీఆర్

KCR Will Decide Who The Next PM Of India Is - Errabelli

ఎంపీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన తర్వాత దేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను కీర్తిస్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన వ్యక్తే భావి భారత ప్రధాని కాబోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి దిశానిర్దేశం చేస్తూ పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు, కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి దేశంలోని అన్ని రాష్ర్టాలకు దిక్సూచిగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీస్థాయి నేతలతో వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నిత్యం మంతనాలు సాగిస్తూ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారం సాధించే దిశగా పూర్తిస్థాయి వ్యూహరచన చేస్తున్నారని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోరపరాభవం తప్పదని, బీజేపీకి అధికారంలోకి వచ్చేంత స్థానాలను సాధించే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. ఇక కేసీఆర్ జీవం పోసిన ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలు 150 సీట్ల వరకు సాధించబోతున్నాయని, కేసీఆర్ ఎవరిని సూచిస్తే వారే ప్రధానమంత్రి కావాల్సిన పరిస్థితులు ఉంటాయని అన్నారు. ఆరు జిల్లాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం బాధ్యత తనపై ఉందన్నారు. ఆరు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని కేసీఆర్‌కు బహుమానం ఇచ్చే విధంగా కార్యకర్తలంతా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.