Movies

అలోపేషియా ఏరియేటా అనే వ్యాధి…

samira reddys pregnancy disease

తల్లయ్యాక సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని, అందుకే బయటికి రాలేకపోయానని అంటున్నారు సినీ నటి సమీరా రెడ్డి. తెలుగులో ‘నరసింహుడు’, ‘అశోక్‌’, ‘జై చిరంజీవ’, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ తదితర చిత్రాల్లో నటించిన సమీరా.. 2014లో అక్షయ్‌ వార్దే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే మొదటి కుమారుడు హన్స్‌ పుట్టిన తర్వాత శరీరాకృతి పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని సమీరా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. హన్స్‌ పుట్టినప్పుడు నా బరువు 102 కిలోలు. ఈ విషయం చెప్పుకోవడానికి నేను భయపడటం లేదు. కానీ ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. నా కాన్ఫిడెన్స్‌ దెబ్బతింది. దాదాపు ఏడాది వరకు బరువు తగ్గలేకపోయాను. ఎందుకంటే వెక్కిరిస్తారేమోనని బయటికి రావడానికి చాలా భయపడ్డాను. పెళ్లికి ముందు ‘సెక్సీ సామ్‌’ అని పిలిచేవారు. పిల్లలు పుట్టాక బరువు పెరగడంతో సమాజం అనే మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదనిపించింది. అందుకే ఇన్నాళ్లూ మీడియా ముందుకు రాకుండా ఉన్నాను. ఇది నాకు ఓ యుద్ధం లాంటిది. చాలా కఠినమైనది. గర్భిణిగా ఉన్నప్పుడు అలోపేషియా ఏరియేటా అనే వ్యాధి సోకింది. దాంతో చాలా జుట్టు రాలిపోయింది. ఆ సమయంలో బయటికి వచ్చుంటే.. ‘తను సమీరారెడ్డా? అలా అయిపోయిందేంటి?’ అనేవారు. అది నేను భరించలేను. అందుకే థెరపిస్ట్‌ల సాయం తీసుకున్నాను. తల్లినైనందుకు సంతోషించాలో, ఓ నటికి ఉండాల్సిన ఛార్మ్‌ కోల్పోతున్నందుకు బాధపడాలో అర్థంకాక ఎంతో సతమతమయ్యాను. ఓ వ్యక్తిగా నన్ను నేను కోల్పోయాను. త్వరగా పిల్లల్ని కని మళ్లీ సినిమాలు చేయాలని అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. బరువు తగ్గడానికి రెండేళ్ల సమయం పట్టింది. సహజంగానే తగ్గాలనుకున్నాను. వర్కవుట్స్‌ చేశాను. పిలాటిస్‌, యోగా చేశాను. ఇదంతా సాధించాలంటే మనకు ధైర్యం ఉండాలి. మార్పు మనలోనే రావాలి. చక్కటి శరీరాకృతిలోకి వచ్చిన తర్వాత నా ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌కు ధన్యవాదాలు చెబుతూ లేఖలు రాశాను. ఇప్పుడు నేను మళ్లీ తల్లిని కాబోతున్నాను. కానీ ఇదివరకు నేను పడిన బాధ ఇప్పుడు నాలో లేదు. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని అందరికీ తెలుసు. కానీ ఓ తల్లిగా మాత్రం నేను గెలిచాననే చెబుతాను.