Business

పాకిస్థాన్ దెబ్బకు ₹300కోట్లు మాయం

pakistan air space ban costed air india heavy amounts

పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై పాక్‌ ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షల కారణంగా భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ మేరకు తాజా నివేదిక వెల్లడించింది. పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో అమెరికా, యూరప్‌ వెళ్లేందుకు భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు ప్రయాణించే దూరం ఎక్కువగా ఉండటంతో పాటు సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో రోజుకు రూ. 6కోట్లు చొప్పున ఎయిరిండియా రూ. 300కోట్లకు పైగా నష్టపోయినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిరిండియా పౌర విమానయాన శాఖను ఆశ్రయించి నష్టపరిహారం కోరినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27 నుంచి పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో దిల్లీ నుంచి అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గంలో మరో 2-3 గంటలు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. విమానం ప్రయాణించే సమయం పెరగడంతో అది సిబ్బంది పని గంటలపైనా ప్రభావం చూపుతోంది. పని ఒత్తిడి తగ్గించేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు ఎయిరిండియా తెలిపింది.