Editorials

ఐరాస నుండి భారత్‌కు బంపర్ బహుమతి

uno slaps masood azhar as international terrorist

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం లభించింది. పఠాన్‌కోట్, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇంతకాలం మసూద్ అజహర్‌ను వెనకేసుకొచ్చిన చైనా తాజాగా తన వైఖరి మార్చుకుంది. భారత్‌కు మద్దతుగా నిలిచింది. దీంతో మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ఇంతకాలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ భారత్‌కు మద్దతిచ్చినా చైనా మాత్రం సాంకేతిక కారణాల పేరుతో మోకాలడ్డుతూ వచ్చింది. పాకిస్థాన్‌కే అండగా నిలిచింది. అయితే ప్రపంచదేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకే వాణి వినిపిస్తున్న తరుణంలో చైనా దారిలోకి రాక తప్పలేదు.మరోవైపు ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాలన్నీ కలిసి రావడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. తమకు మద్దతిచ్చిన అన్ని దేశాలకూ ధన్యవాదాలు తెలిపింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల మసూద్ అజహర్‌‌పై తీవ్ర ఆంక్షలు ఏర్పడతాయి. మసూద్ ఆస్తులను పూర్తిగా స్థంభింపచేస్తారు. కదలికలపై నిషేధం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్‌ మరిన్ని చిక్కుల్లో పడింది. అసలే ఉగ్రవాద కేంద్రంగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి ఇచ్చిన షాక్‌తో అంతర్జాతీయంగా పరువు పోయినట్లైంది.1999లో కాందహార్ విమాన హైజాక్ ఘటనలో ప్రయాణికులను విడిపించుకునేందుకు మసూద్ అజహర్‌ను నాటి ఎన్డీయే ప్రభుత్వం విడిచిపెట్టాల్సి వచ్చింది.భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ మసూద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం మోదీ సర్కారుకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.