Business

పెప్సికో తలబిరుసు తగ్గించిన గుజరాత్ రైతులు

pepsico ready to withdraw cases against indian farmers

ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళాదుంపల సాగును నిలిపివేస్తేనే గుజరాత్‌కు చెందిన రైతులపై తాము పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామన్న ప్రముఖ శీతలపానీయాల సంస్థ పెప్సికో చివరకు రైతుల పోరాటంతో దిగిరాక తప్పలేదు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఆ సంస్థ గుజరాత్‌ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. పెప్సికోకు చెందిన లేస్‌, చిప్స్‌ కోసం ఎఫ్‌సీ 5 రకానికి చెందిన బంగాళదుంపలపై పేటెంట్‌ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మేథోహక్కు పొందిన బంగాళదుంపలను గుజరాత్‌కు చెందిన నలుగురు రైతులు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సికో సంస్థ కేసులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పెప్సికో తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పెప్సికో సంస్థ దిగి వచ్చింది.