కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేఠీలో తాను తప్పకుండా విజయం సాధిస్తానని కేంద్ర మంత్రి, స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె గురువారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ పార్టీ తాము ఓడిపోయే యుద్ధంలో పోరాడుతోంది. నేను తప్పకుండా గెలుస్తాను. నా గెలుపు అమేఠీ ప్రజల గెలుపుగా నిలుస్తుంది. ఈ నియోజక వర్గంలో బీఎస్పీ-ఎస్పీ సైతం రాహుల్‌కి మద్దతు తెలుపుతున్నప్పటికీ మేము గట్టిపోటీనిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని రెండు స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరడం చరిత్రలో ఇదే మొదటిసారి. అమేఠీ స్థానంలో రాహుల్ గెలుపు సాధ్యం కాదనే ఈ పని చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఇది అమేఠీ ప్రజలకు, ఈ నియోజక వర్గానికి రాని రాహుల్‌కి మధ్య జరుగుతున్న పోరు. ఆయన ఐదేళ్లుగా అమేఠీకి రాలేదు.. కనీసం ప్రచారంలో పాల్గొనడానికి కూడా రావట్లేదు. పార్లమెంటులోనూ ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడరు. భాజపాలో నేను ఒక సాధారణ కార్యకర్తను. అయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను’ అని స్మృతి ఇరానీ తెలిపారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఆమె ఓడిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 39 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 41 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
రాహుల్ జీ…మీ ఒటమి ఖాయం
Related tags :