సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నారు. గచ్చిబౌలిలో రాత్రివేళ పది గంటలకు విధులు ముగించుకొని బాచుపల్లిలోని ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. ఓరోజు తోటి ఉద్యోగినులతో కలిసి సైబర్ టవర్స్ వద్ద డిన్నర్ చేసేందుకు ఆగారు. ఛార్జింగ్ అయిపోయి చరవాణి స్విచ్ఛాఫ్ అయింది. ఆ రోజు ఇంటికి వెళ్లేసరికి ఆలస్యమైంది. అర్ధరాత్రయినా రచన ఇంటికి రాకపోవడం.. చరవాణి పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడిపోయారు. చివరకు ఠాణాకు వెళదామని అనుకొంటుండగానే రచన ఇంటికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఉదంతాలు ఒక్క రచన కుటుంబానికే పరిమితం కాదు. రాత్రివేళ ఐటీ సంస్థల్లో పనిచేసే పలువురు ఉద్యోగినుల విషయంలో తరచూ చోటు చేసుకొంటూనే ఉంటాయి. ఐటీ కారిడార్‌లో చిన్నాపెద్ద కలిపి సుమారు 1000వరకు ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థలుంటాయి. వీటిల్లో దాదాపు 5లక్షల మంది పనిచేస్తున్నారు. మహిళలు 30 నుంచి 40శాతం ఉన్నారు. వీరు నిత్యం నగరం నలుమూలల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్ మహానగరం కావడంతో రాత్రివేళ విధులు నిర్వర్తించడానికీ ఉద్యోగినులు వెనకాడటం లేదు. ఈ క్రమంలో పలు సంస్థలు వీరి కోసం సొంతంగా రవాణా వ్యవస్థను నిర్వహిస్తున్నాయి. ఫిర్యాదులతో పోలీసుల అప్రమత్తం… ఇటీవల యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో మైనర్లపై అత్యాచారం, హత్య ఘటనలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెల రోజులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో ముగ్గురు గుర్తు తెలియని మహిళలను దుండగులు హత్య చేసి మృతదేహాలను పెట్రోల్ పోసి దహనం చేసిన ఉదంతాలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఐటీ సంస్థల్లోని మహిళ ఉద్యోగులకు భద్రత కట్టుదిట్టం చేసే అంశంపై కమిషనర్ వీసీ సజ్జనార్ దృష్టి సారించారు. ఉద్యోగినులు క్షేమంగా రాకపోకలు సాగించేలా రవాణా బాధ్యతలను ఆయా సంస్థలే తీసుకునేలా కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా రాత్రివేళ 8.30 దాటిన తర్వాత కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగినులకు తప్పనిసరిగా సంస్థలే క్యాబ్‌లు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రవాణా సదుపాయం ఉందనే విషయాన్ని నోటీస్ బోర్డుల్లో ఉంచాలని సైబరాబాద్ కమిషనర్ సంస్థలకు సర్క్యులర్ జారీ చేశారు. 2016 జూన్ 16న కార్మిక శాఖ ఓ జీవో జారీ చేసింది. లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ సెక్షన్ 3(వి) ప్రకారం ఆయా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రవాణా సదుపాయం సమకూర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 8.30 దాటిన తర్వాత తప్పనిసరిగా సంస్థ క్యాబ్‌ల్లోనే ఉద్యోగినులను ఇంటికి సురక్షితంగా చేర్చాలి.ఈ జీవోను ప్రస్తుతం పక్కాగా అమలు చేసేలా చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ఉద్యోగినులు కార్యాలయం నుంచి సంస్థ క్యాబ్‌లో కాకుండా వేరే వాహనంలో వెళితే తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు లేదంటే శ్రేయోభిలాషులకు సమాచారం అందించడం ఉత్తమం. ఏదైనా అనూహ్య ఘటన జరిగితే 100కు డయల్ చేయడం లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబరు 94906 17444కు సమాచారం అందించి సహాయం పొందవచ్చు.
ఐటీ ఉద్యోగినుల రవాణా బాధ్యత ఆ కంపెనీలదే!
Related tags :