పట్టాభిషేకానికి కొద్ది రోజుల ముందు థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలోంగ్‌కోర్న అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన వ్యక్తిగత బాడీగార్డుల డిప్యూటీ హెడ్‌ను వివాహం చేసుకొని ఆమెకు రాణి సుతిధ అనే పేరు పెట్టారు. ఈ నిర్ణయాన్ని రాయల్ గెజిట్‌లో కూడా ప్రచురించారు. థాయ్ టెలివిజన్ ఈ వివాహానికి సంబంధించిన ఫుటేజీని కూడా ప్రసారం చేసింది. 66ఏళ్ల వజ్రలోంగ్‌కోర్న శనివారం రాజుగా పట్టాభిషేకం జరుపుకోనున్నారు. ఆయన ఈ సింహాసనం అధిష్టించాక 10వ రామగా బిరుదును అందుకోనున్నారు. 2016 అక్టోబర్ రాజు భూమిబోల్ మరణం తర్వాత ఈ పట్టాభిషేకం జరుగుతోంది. పెళ్లికుమార్తె సుతిధ గతంలో థాయ్ ఎయిర్‌వేస్‌లో అటెండెంట్‌గా పనిచేశారు. ఆమెను యువరాజు వజ్ర తన భద్రతా సిబ్బందిలో డిప్యూటీ కమాండర్‌గా నియమించుకొన్నారు. అప్పట్లో ఈ విషయమై పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. కానీ వీరిద్దరి బంధాన్ని రాజభవన వర్గాలు ధ్రువీకరించలేదు. 2016లో సుతిధను థాయ్ సైన్యంలో పూర్తికాలపు జనరల్‌గా వజ్ర నియమించారు. రాజు వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోకి 2017లో స్థానం కల్పించారు. అమెకు తాన్‌పుయింగ్ అనే రాయల్ టైటిల్‌ను కూడా కట్టబెట్టారు.
భద్రతా సిబ్బందిలో మహిళను పెళ్లాడిన థాయి రాజు
Related tags :