Devotional

కల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు

ttd brahmotsavam 2019 details released by jeo laxmikantha ias today

శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌. టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 16 నుంచి 24వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గోడ‌ప‌త్రిక‌ల‌ను గురువారం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంద‌ని, మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయ‌ని తెలిపారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు. బ్ర‌హ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయ‌ని తెలిపారు. మే 23వ తేదీ రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం జ‌రుగ‌నుంద‌ని, రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చ‌ని వివ‌రించారు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్న‌ట్టు తెలిపారు.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

16-05-2019(గురువారం) ధ్వజారోహణం(ఉ|| 10 నుంచి 11 వరకు) పెద్దశేష వాహనం

17-05-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

18-05-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

19-05-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

20-05-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

21-05-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం

22-05-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

23-05-2019(గురువారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

24-05-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి స్థానికాల‌యాల డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, ఏఈవో శ్రీ తిరుమ‌ల‌య్య‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ నాగ‌రాజ పాల్గొన్నారు.