Business

మేక వన్నె ముసుగులో ఎన్ని లొసుగులో!

Chanda Kochhar Diverted Funds To Essar Steel Despite RBIs Friction

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌పై మరోసారి వివాదం తలెత్తింది. వీడియోకాన్‌ విషయంలోనే కాకుండా.. ఎస్సార్‌ స్టీల్‌ రుణాల లావాదేవీలపైనా అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం..వందల మిలియన్‌ డాలర్లను ఎస్సార్‌స్టీల్‌కు చెందిన మారిషస్‌ అనుబంధ కంపెనీ ఎస్సార్‌ స్టీల్‌మిన్నెసోటా ఎల్‌ఎల్‌సీకి నిబంధలకు విరుద్ధంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్‌బీఐ ప్రశ్నించినా పక్కదోవ పట్టించినట్లు ఆ కథనం చెబుతోంది. జులై 2014.. చందా కొచ్చర్‌ ఆధ్వర్యంలో జారీ చేసిన రుణాలపై తొలిసారిగా ఆర్‌బీఐ అనుమానం వ్యక్తం చేసిన తేదీ. కొన్ని దర్యాప్తు రికార్డుల ప్రకారం.. ఎస్సార్‌స్టీల్‌కు చెందిన మిన్నెసోటా ఎల్‌ఎల్‌సీ కంపెనీకి ఆ బ్యాంకు 365 మి. డాలర్ల విలువైన రుణాలను జారీ చేసింది. అయితే ఈ రుణం విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు ఆర్‌బీఐ కనిపెట్టినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో తెలిపింది. ఎస్సార్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ఒకటి. 2019-10 ప్రారంభం నుంచి 2018-19 చివరి దాకా ఈ బ్యాంకు ఎస్సార్‌కు 71 రుణాలు మంజూరు చేసినట్లు ఆ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. కాగా, ఈ రుణాలను జారీ చేసిన కమిటీలు పాల్గొన్న 35 సమావేశాల్లో కొచ్చర్‌ కూడా భాగంగా ఉన్నారు. ముఖ్యంగా ఎస్సార్‌స్టీల్‌ మిన్నెసోటా ప్రాజెక్టు వార్షిక సామర్థ్యాన్ని 4.1 మిలియన్‌ టన్నుల నుంచి 7 మిలియన్‌ టన్నులకు పెంచుకోవడం కోసం ఇచ్చిన రుణాల విషయంలో ఆర్‌బీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు రుణాల అనుమతుల విషయంలో ఆర్‌బీఐ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా రుణ ఒప్పందంలోని సౌలభ్యాలపై అనుమానం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఏర్పాటును పొడిగించుకోవడానికి అందులో ఐసీఐసీఐ బ్యాంకు అంగీకరించింది. అదీకాక ఆ కంపెనీ తీసుకున్న ఒక రుణానికి సహాయపడడానికి తాజాగా మరో రుణం ఇస్తూ పోయిందని.. ఎప్పటికప్పుడు రుణాలు ఇస్తూనే ఉందని ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రుణాలను ‘ప్రమాణాలు లేని ఆస్తుల’ విభాగంలోకి చేర్చాలని కూడా ఆర్‌బీఐ అప్పట్లోనే చెప్పింది. అయితే ఆర్‌బీఐ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ఒప్పుకోలేదు. ప్రాజెక్ట్‌ సామర్థ్యం పెరిగింది కాబట్టి రుణాలను ఇచ్చామని.. అదనంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని బ్యాంకు చెప్పుకొచ్చింది. అయితే అందుకు విరుద్ధంగా చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. జూన్‌ 2014లో విదేశీ కరెన్సీ రూపంలో ఎస్సార్‌ స్టీల్‌ మారిషస్‌ శాఖకు 365 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. రుణ కమిటీ సమావేశం మినిట్స్‌లోనూ ‘ఎస్సార్‌స్టీల్‌ మిన్నెసోటాకు నిధులు అందజేసినట్లు’ ఉందని ఆ దర్యాప్తు వెల్లడిస్తోంది. ఆర్‌బీఐ అడిగినప్పటికీ.. ఎటువంటి అదనపు నిధులూ ఇవ్వలేదని కొచ్చర్‌ ఆర్‌బీఐని తప్పుదోవ పట్టించినట్లు దర్యాప్తులో తెలుస్తోంది. ఆ గ్రూపు పలు ఎగవేతలకు పాల్పడినా.. రేటింగ్‌ సంస్థలు ప్రతికూల రేటింగ్‌ ఇచ్చినా.. బయటి నుంచి పలు ఫిర్యాదులు వచ్చినా కూడా కొచ్చర్‌ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంకు రుణాలను కొనసాగించింది. ఏ బ్యాంకు కూడా ఆ గ్రూపునకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోయినా.. ఐసీఐసీఐ మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతోందంటూ బయటి నుంచి ఫిర్యాదులు వచ్చినా.. వాటిపై కొచ్చర్‌ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. అలాగే గ్రూపుపై పరిశీలన చేసి రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. కొచ్చర్‌ ఆ పని చేయలేదని తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ 2011-2016లో జరిగినవని.. ఆ తర్వాతి నుంచే బ్యాంకు తన బ్యాలెన్స్‌ షీటులో నష్టభయాలను తగ్గించుకునేందుకు గట్టి చర్యలు చేపట్టామని ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధి ఆ ఆంగ్ల పత్రికకు తెలిపినట్లు సమాచారం.