Business

భారతీయుల బెస్ట్ బిజినెస్ స్పాట్ – లండన్

Indians Best Business Investment Interests Are In London

భారత పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో లండన్‌ మొదటిస్థానంలో ఉన్నట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది. దుబాయ్‌, సింగపూర్‌ లాంటి ప్రముఖ నగరాలతో పోలిస్తే బ్రిటన్‌ రాజధాని లండన్‌లోనే భారతీయులు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 52 ప్రాజెక్టులతో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ముందు వరుసలో నిలవగా.. అమెరికా 51 ప్రాజెక్టులు, యూఏఈ 32 ప్రాజెక్టులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయని లండన్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌’ వెల్లడించింది. 2017తో పోలిస్తే గత సంవత్సరం ఏకంగా 32 ప్రాజెక్టుల్లో భారత వ్యాపారులు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఎఫ్‌డీఐలు దాదాపు 255శాతం మేర వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అలాగే బ్రిటన్‌లో భారత పెట్టుబడుల్లో 100శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. అందులో 60శాతం లండన్‌ కంపెనీల్లోనే ఉన్నాయని వెల్లడించారు. దీనిపై ‘లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌’ సంస్థ కార్యనిర్వహక అధ్యక్షుడు లారా సిట్రాన్‌ హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని భారత కంపెనీలను ఆకర్షించేలా చర్యలు చేపడతామని తెలిపారు. భారత్‌తో త్వరలో జరగనున్న ట్రేడ్‌ మిషన్‌ తమకు ఓ మంచి అవకాశంగా భావిస్తున్నానమ్నారు. ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ, ఫిన్‌టెక్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా భారత్‌లోని ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా సంస్థకు చెందిన కొంత మంది ప్రతినిధులు ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాల్లో పర్యటిస్తారన్నారు. అలాగే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్‌లో లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలకు మెరుగైన వ్యాపార అవకాశాలు ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు. తాజా సమాచారం ప్రకారం గత 10ఏళ్లలో భారత్‌ కంపెనీలు లండన్‌లో దాదాపు 2.49 బిలియన్‌ పౌండ్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో దాదాపు 5691 ఉద్యోగాల సృష్టి జరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2018లో లండన్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఓలా, ఓయో లాంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి.