DailyDose

మదుపర్లకు భయాలు-వాణిజ్య-05/04

indian investors in ambiguous situation

Ø ఎసెల్‌ గ్రూప్‌ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. ఆస్తుల నగదీకరణపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే గ్రూప్‌ కష్టాలు కాస్తా ఫండ్‌ మదుపర్లకు ఇబ్బందులు తీసుకురానున్నాయి. కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌లు ఇపుడు తమ మదుపర్లకు సర్దిచెప్పే పనిలో పడ్డాయి. ఈ రెండు ఫండ్‌ సంస్థలకు చెందిన పథకాలు ఎసెల్‌ గ్రూప్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో గడువు తీరిన పథకాలకు చెల్లింపులు ఆలస్యం అవుతాయని.. లేదంటే పథకాలను రోలోవర్‌ చేసుకోమని ఆయా ఫండ్‌ సంస్థలు మదుపర్లకు నచ్చచెబుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబరు చివరకు గడువు తీరనున్న 12 పథకాల విషయంలో మదుపర్లకు ఎక్కువ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ø విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐలు) దృష్టి ఇప్పుడు బీమా సంస్థలపై పడింది. ఈ రంగంపై వారు ఎంతో సానుకూలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఒక్క మార్చి నెలలోనే వారు సుమారు రూ.7 వేల కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీల్లో గుమ్మరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తం పరిశీలిస్తే తొలి 11 నెలల్లో బీమా కంపెనీల్లో వారు పెట్టిన పెట్టుబడులు కేవలం రూ.2,840 కోట్లు కాగా, ఒక్క మార్చి నెలలోనే భారీగా పెట్టుబడులు పెట్టడం ఇక్కడ గమనించాల్సిన అంశం

Ø ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,538 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.1,351 కోట్లతో పోలిస్తే ఇది 13.84 శాతం అధికం.

Ø గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ రూ.935.24 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.617.19 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 51.53 శాతం అధికం.

Ø ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి 441 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3,087 కోట్లు) నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం 520 మి.డాలర్లతో (రూ.3,640 కోట్లు) పోలిస్తే ఇది 17.9 శాతం తక్కువ.

Ø బాలీవుడ్‌ దిగ్గజం రాజ్‌కపూర్‌ నిర్మించిన ఆర్‌కే స్టూడియోస్‌ గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ ఆధీనంలోకి చేరింది. నగర శివార్లలోని చెంబూర్‌ ప్రాంతంలో ఈ స్టూడియోను రాజ్‌కపూర్‌ 1948లో నెలకొల్పారు.

Ø దివాలా స్మృతి కింద జాతీయ కంపెనీ లా ట్రైబ్యునళ్ల (ఎన్‌సీఎల్‌టీ)కు చేరిన 94 రుణ కేసుల్లో రూ.లక్ష కోట్ల మొత్తాన్ని బ్యాంకులు వదిలేసుకున్నాయని (హెయిర్‌ కట్‌) క్రిసిల్‌-అసోచామ్‌ నివేదిక వెల్లడించింది. ఆయా రుణ ఖాతాల నుంచి బ్యాంకులకు రూ.1.75 లక్షల కోట్లు రావాల్సి ఉండగా, వసూలైంది రూ.75,000 కోట్లు అని, వాటికి రావాల్సిన మొత్తంలో ఇది 43 శాతమేనని తెలిపింది.

Ø విశాకా ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.301.54 కోట్ల ఆదాయాన్ని, రూ.14.04 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.8.84 నమోదైంది.

Ø జీఎంఆర్‌ గ్రూపు సంస్థ అయిన జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ప్రగతి సాధించింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు రుణదాతల ఆమోదాన్ని పొందటమే కాకుండా, దాని అమలుకు సిద్ధమైనట్లు జీఎంఆర్‌ గ్రూపు శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుత అప్పు రూ.2,353 కోట్లలో రూ.941 కోట్లను 0.1 శాతం వడ్డీరేటుతో దీర్ఘకాలిక క్యుములేటివ్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్స్‌ (సీఆర్‌పీఎస్‌)గా మార్చుతారు.

Ø సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎప్పటి నుంచో దక్కించుకోవాలని చూస్తున్న రుచిసోయా చేతికి చిక్కింది. బాబా రామ్‌దేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌ అరంగేట్రంతోనే.. భారత ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాన్ని ఒక ఊపు ఊపింది. అయితే కొన్ని వర్గాలకే పరిమితం కావడం, అమ్మకాల్లో వృద్ధి సాధించలేకపోవడంతో ఇటీవల ఒడుదొడుకులు ఎదుర్కొంది. పతంజలి తాజాగా సమర్పించిన రూ.4,325 కోట్ల బిడ్‌కు రుచి సోయా రుణదాతలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. హరిద్వార్‌ కేంద్రంగా పనిచేస్తున్న పతంజలికి ఇదే మొదటి పెద్ద కొనుగోలు కావడం గమనార్హం. తాజా కొనుగోలుతో సోయాబీన్‌ నూనె, ఒక శ్రేణి ఆహార ఉత్పత్తుల్లో పతంజలి అగ్రగామిగా నిలవనుంది.

Ø అపార్ట్‌మెంట్‌ సముదాయంలో కార్‌పార్కింగ్‌, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌ వంటి సదుపాయాలతో కలిపి ఫ్లాట్‌ కొనుగోలు చేసుకుంటే, అన్నింటికీ కలిసి తక్కువ జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) వర్తిస్తుందని అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌) పేర్కొంది. వీటిని సమ్మిళిత నిర్మాణ సేవగా పరిగణిస్తామని తెలిపింది. ఇతర సేవలపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతున్నా, ఇలా కలిపి కొనుగోలు చేసినపుడు నిర్మాణానికి వర్తించే 12 లేదా 5 శాతం జీఎస్‌టీనీ విలువ మొత్తానికీ విధించాలని ఏఏఆర్‌ పశ్చిమబెంగాల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

Ø ఇబీఎంతో ఐటీ పొరుగు సేవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వొడాఫోన్ ఇండియా వెల్లడించింది. ఈ కాంట్రాక్టును ఐదేళ్ళ కాలానికి పొందినట్లు పేర్కొంది

Ø బ్యాంకుల మాదిరే బీమా కంపెనీలు కూడా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాలకు తగిన కేటాయింపులు చేయాలని బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ పేర్కొంది. అదే సమయంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ అనుబంధ సంస్థలైన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌లకు ఇచ్చిన రుణాల విషయంలోనూ ఇదే పనిచేయాలని శుక్రవారం సూచించింది