జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల వల్ల చార్మినార్ మాన్యుమెంట్‌కు ఏవిధమైన ప్రమాదంలేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల చార్మినార్ పై భాగంలోని మినార్ పాక్షికంగా కూలిన సంఘటన స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారుల బృందం నేడు పరిశీలించింది. చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ముషారఫ్ అలీ, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ముషారఫ్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల వల్ల చార్మినార్ కట్టడానికి పూర్తిస్థాయిలో భద్రత ఏర్పడడంతో పాటు పరిసర ప్రాంతాల సుందరీకరణ జరిగిందని స్పష్టం చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చారిత్రక మోజంజాహి మార్కెట్ పునరుద్దరణ, కులి కుత్బుషా సమాదుల పునరుద్దరణ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, వీటి పునరుద్దరణలో సాంప్రదాయ బద్దంగా సున్నపురాయి మిశ్రమాన్ని సరైన పాళ్లలో ఉపయోగించామని వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల పునరుద్దరణ జరిగిన శాస్త్రీయ పద్దతిలో చార్మినార్ మినార్ పునరుద్దరణ జరగలేదని అభిప్రాయపడ్డారు. సిపిపి ప్రాజెక్ట్ వల్ల చార్మినార్ నుండి ప్రతిరోజు వెళ్లే దాదాపు 10వేలకు పైగా బస్సులు, వాహనాలను దారి మల్లించి చార్మినార్‌ను కాలుష్య భారిన పడకుండా నిరోధించామని స్పష్టం చేశారు. చార్మినార్ చుట్టూ ఉండే వీధి వ్యాపారులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లలో భాగంగా సాలర్‌జంగ్ మ్యూజియం ఎదురుగా మూసినదిపై దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ప్రత్యేక వంతెన నిర్మించనున్నామని తెలిపారు. లాడ్ బజార్ మార్గాన్ని అసఫ్‌జాహి సాంప్రదాయాన్ని తెలిపేవిధంగా ఫసార్డ్ అభివృద్ది పనులను చేపట్టామని పేర్కొన్నారు. చార్మినార్ సమీపంలో జీహెచ్ఎంసీ కార్యాలయాలు ఉన్న సర్దార్ మహల్ భవనంలో మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చార్మినార్ పై భాగంలోని మినార్ పాక్షికంగా కూలడానికి చార్మినార్ పెడెస్టేరియన్ పనులకు ఏవిధమైన సంబంధంలేదని ముషారఫ్ అలీ మరోసారి స్పస్టం చేశారు.
చార్మినార్‌కు ఏ విధమైన అపాయం లేదు-బల్దియా సర్టిఫికేట్!
Related tags :